Nellore | ఏ సహాయం కావాలన్నా..

Nellore | ఏ సహాయం కావాలన్నా..
Nellore | నెల్లూరు ప్రతినిధి, ఆంధ్రప్రభ : దిత్వా తుఫాను నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నందున అధికారులు, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం ఆయన నెల్లూరు జిల్లా తుఫాన్ (Cyclone) ప్రత్యేక అధికారి, రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి యువరాజ్, జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లుతో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకుంటున్న చర్యల పై చర్చించారు. సోమశిల, కండలేరు జలాశయాలు, సంగం, నెల్లూరు బ్యారేజ్ ల నీటి ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జలాశయాల వద్ద ఎప్పటికప్పుడు నీటి పరిస్థితిని అంచనా వేస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ఆత్మకూరు (Atmakuru) ప్రాంతాల్లో బీరాపేరు వాగు, బొగ్గేరు వాగుల పై ప్రత్యేక నిఘా పై ఈ సందర్భంగా మంత్రి ఆరా తీసారు. జిల్లాకు భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వపరంగా ఏ సహాయం కావాలన్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అధికారులకు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరాయంగా తుఫాను ప్రభావం పై నిశితంగా పరిశీలిస్తున్నారని అన్నారు. జిల్లా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మంత్రి ఆనం కోరారు.
