amarnath l అంబటి కుటుంబాన్ని పరామర్శించిన గుడివాడ అమర్ నాథ్

amarnath l అంబటి కుటుంబాన్ని పరామర్శించిన గుడివాడ అమర్ నాథ్
అంబటి కుటుంబాన్ని పరామర్శించిన ఉత్తరాంధ్ర కాపు నేతలు..
మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ నేతృత్వంలో ర్యాలీగా అంబటి ఇంటికి..
కూటమి ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేసిన నేతలు
amarnath l గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభః మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడి, తదనంతర పరిణామాలు పెను దుమారం రేపుతున్నాయి. ఈ ఘటనను నిరసిస్తూ, రిమాండ్‌లో ఉన్న అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఉత్తరాంధ్ర నుండి సుమారు 300 కార్లలో భారీ కాన్వాయ్‌తో వైసీపీ కాపు నేతలు గుంటూరుకు తరలివచ్చారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలోని ఈ బృందం ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగింది. అంబటిపై భౌతిక దాడులు చేసి, తిరిగి ఆయనపైనే 30 కేసులు పెట్టడాన్ని అమర్‌నాథ్ ‘స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం’గా అభివర్ణించారు. కాపు సామాజికవర్గ నేతలను అణచివేసే కుట్రలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని, తిరుమల లడ్డూ ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వారు, సిట్ విచారణలో నిజాలు బయటకు వస్తాయనే భయంతోనే భక్తులను అయోమయానికి గురిచేసేలా ఫ్లెక్సీల డ్రామాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు.
మరోవైపు, కాపు నేతలను టార్గెట్ చేయడం తెలుగుదేశం పార్టీ డీఎన్ఏలోనే ఉందని కరణం ధర్మశ్రీ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో లోకేష్, ధూళిపాళ్ల, పెమ్మసాని వంటి కీలక నేతల కనుసన్నల్లోనే ఎమ్మెల్యే గల్లా మాధవి దంపతులు అత్యంత ప్రణాళికాబద్ధంగా అంబటిపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను ఉక్కుపాదంతో నొక్కేయాలని చూస్తున్నారని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేస్తూ అంబటికి అండగా కాపు నేతలంతా ఏకతాటిపై నిలుస్తామని హెచ్చరించారు. ఈ దాడుల వెనుక చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రోద్బలం ఉందని ఆయన విమర్శించారు.
అంబటి రాంబాబు కుమార్తె మౌనిక సైతం కూటమి నాయకుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గతంలో పవన్ కళ్యాణ్‌ను అవమానించిన వారే ఈరోజు ఓట్ల కోసం ఆయన పంచన చేరారని ఎద్దేవా చేశారు. క్షమాపణల పేరుతో కర్రలు, రాళ్లు, మారణాయుధాలతో ఇంటిపైకి వచ్చి హత్యాయత్నానికి పాల్పడటం ఏ రకమైన సంస్కృతి అని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే గల్లా మాధవి అహంకారంతో వ్యవహరిస్తున్నారని, కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాలను మరింత కలుషితం చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి ధైర్యంగా నిలబడ్డారని చెబుతూ, జగన్ గారు పరామర్శకు వచ్చిన సమయంలో ఆభరణాలు పోయాయంటూ కూటమి నేతలు చేస్తున్న ప్రచారం వారి నీచ రాజకీయాలకు పరాకాష్ట అని మౌనిక ధ్వజమెత్తారు.
