నేత్రదానంతో ‘సజీవం’.. సత్యప్రకాష్ కుటుంబీకుల ఆదర్శం

బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా.. తన నేత్రాల ద్వారా మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి సజీవంగా నిలిచారు. పట్టణంలోని కాల్‌టెక్స్ ప్రాంతానికి చెందిన కొట్టె సత్యప్రకాష్ (68) శనివారం తుదిశ్వాస విడిచారు. తండ్రి వియోగంతో కుటుంబ సభ్యులు పుట్టెడు శోకంలో ఉన్నప్పటికీ, సామాజిక బాధ్యతను మరువలేదు. మృతుని కుమారుడు, జనహిత సేవా సమితి సభ్యుడు కొట్టె వినయ్ తన తండ్రి నేత్రాలను దానం చేయాలని నిర్ణయించుకున్నారు.

కుటుంబ సభ్యులంతా ఇందుకు ఏకగ్రీవంగా అంగీకరించడంతో, సదశయా ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి సి.హెచ్. లింగమూర్తి సమన్వయంతో ఎల్.వి. ప్రసాద్ ఐ బ్యాంక్ ప్రతినిధులు నేత్రాలను సేకరించారు. ఈ సందర్భంగా జనహిత సేవా సమితి అధ్యక్షుడు ఆడెపు సతీష్ మాట్లాడుతూ.. సత్యప్రకాష్ కుటుంబ సభ్యుల నిర్ణయం సమాజానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.
నేత్రదానం ద్వారా ఇద్దరు అంధులకు చూపు ప్రసాదించవచ్చని, తద్వారా వారు ఈ ప్రపంచాన్ని చూసే అవకాశం కలుగుతుందని తెలిపారు. నేత్రదానమే కాకుండా, అవయవ దానం ద్వారా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడవచ్చని, శరీర దానం వైద్య విద్యార్థుల పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. ప్రజలు అపోహలు వీడి అవయవ దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అనంతరం ఐ బ్యాంక్ తరపున నేత్రదాన ధ్రువీకరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జనహిత ప్రతినిధులు పెద్ది వినయ్ కుమార్, డోలి సుకుమార్ మరియు బంధుమిత్రులు పాల్గొన్నారు.
