- డీఎస్పీ వచ్చే అవకాశం
- స్టేట్ లో 161,మల్టీజన్1లో 82 ర్యాంకు
జన్నారం, ఏప్రిల్1(ఆంధ్రప్రభ) : చదువులో చురుకుదనం, కష్టపడుతూ ఇష్టం కొద్ది చదువుకొని పైకొచ్చే మనస్తత్వంతో ఐఏఎస్ కావడమే ఆ యువకుని లక్ష్యం. మండలంలోని పొనకల్ గాంధీనగర్ నిరుపేద కుటుంబానికి చెందిన మెరిసిన కుసుమం ఆ యువకుడు. ఆ యువకునికి గ్రూప్-1లో స్టేట్ లో 161 ర్యాంకు, మల్టీజోన్ 1లో 82వ ర్యాంకు వచ్చింది. యువకునికి డీఎస్పీ వచ్చే అవకాశముంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని పొనకల్ గాంధీనగర్ కు చెందిన నగురు హరిదాసు, భాగ్యలక్ష్మి దంపతులకు ముగ్గురు సంతానం. అందులో కవల కుమారుల్లో చిన్నవాడే అనిల్ కుమార్. అతని తండ్రి హరిదాస్ ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేస్తూ 10సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయారు.
ఆ దంపతులకు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు అరుణ్ కాగా, అజయ్ కుమార్, అనిల్ కుమార్ కవలలు. పెద్దవాడైన అరుణ్ కుమార్ ఆర్టీసీలో కండక్టర్ గా తండ్రి ఉద్యోగం చేస్తుండగా, అజయ్ కుమార్ విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. తల్లి భాగ్యలక్ష్మి భర్త చనిపోయాడని దుఃఖాన్ని దిగమింగుకుంటూ బీడీలు చేసుకుంటూ ఎంతో కష్టపడి ముగ్గురు కుమారులను చదివించింది. అనిల్ కుమార్ ఒకటి నుంచి 10వ తరగతి వరకు మండల కేంద్రంలోని శ్రీ రాజరాజేశ్వర ఉన్నత పాఠశాలలో చదివి, కరీంనగర్ లోని సి.వి రామన్ లో ఇంటర్మీడియట్ విద్యను అభ్యసించి, హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశారు.
చదువుల్లో చురుకైన అనిల్ కుమార్ కు గత ఏడాది గ్రూప్-4 లో మంచి ర్యాంకు వచ్చి, ప్రస్తుతం అతను హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. అతను గ్రూప్-2, గ్రూప్- 3 లోను మంచి ర్యాంకులు సాధించారు. గ్రూప్-1లో మంచి ర్యాంకు సాధించిన అనిల్ కుమార్ కు తల్లి భాగ్యలక్ష్మి, అన్నలు అరుణ్ కుమార్, అజయ్ కుమార్ లు మంగళవారం స్వీటు తినిపించి, అభినందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ… తాను ఐఏఎస్ కావడమే ముఖ్య లక్ష్యమన్నారు. తనకు ప్రస్తుతం డీఎస్పీ పోస్టు వస్తుందని, తను శరీరకంగా అర్హుడినని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం వచ్చిన ఉద్యోగంలో చేరి కష్టపడి చదువుకుంటూ ఐఏఎస్ సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అతన్ని బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు అభినందించారు.