Makthal | మూడురోజుల ముచ్చటైన పండగ సంక్రాంతి

Makthal | మూడురోజుల ముచ్చటైన పండగ సంక్రాంతి
- 14న భోగి పండుగ
- 15న మకర సంక్రాంతి
- 16 న కనుమ పండుగ
- పట్నం నుండి పల్లె బాట పట్టిన జనం
- కళకళలాడుతున్న పల్లెలు
Makthal | మక్తల్, ప్రభన్యూస్ : హిందువుల ప్రధాన పర్వదినాల్లో సంక్రాంతి పండుగ ప్రత్యేకత సంతరించుకుంటుంది. ప్రతి పండుగ ఒక రోజు మాత్రమే జరుపుకుంటారు .కానీ సంక్రాంతి పండుగ మాత్రం ముచ్చటగా మూడు రోజులు జరుపుకోవడం విశేషంగా చెప్పుకోవచ్చు. అది ప్రత్యేకించి పల్లె ప్రజల పండుగ. సంక్రాంతికి ఓ ప్రత్యేకత ఉంది. రైతు చేతికి పంట వచ్చిన తర్వాత వచ్చే పండుగ సంక్రాంతి పండుగను భోగి, మకర సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకోవడం విశేషం. భోగి, మకర, కనుమ కి మూడు ప్రత్యేకతలు ఉంటాయి. మూడు రోజులు మూడు రకాలుగా పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో కుటుంబసభ్యులంతా కలిసి సంతోషంగా జరుపుకుంటారు. పల్లెల్లో జీవనం గడవక జీవనోపాధి కోసం పట్నం వెళ్లిన వారంతా పట్నం నుండి పల్లె బాట పట్టారు. కర్ణాటక సరిహద్దులో ఉన్న పాలమూరు జిల్లాలో ఉపాధి కోసం లక్షల మంది ముంబాయి, పూణె , సోలాపూర్, అంబర్ నాథ్, హైదరాబాద్, సూరత్ వంటి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లారు. అదేవిధంగా ఉద్యోగరీత మహబూబ్నగర్, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో ఉంటున్నారు. వారంతా సంక్రాంతి పండుగ కోసం సంతూళ్లకు పయనమయ్యారు. దీంతో పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.
సంక్రమణం అంటే గమనం సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి అడుగు పెట్టడాన్ని సంక్రమణం అంటారు. సంవత్సర కాలంలో సూర్యుడు పన్నెండు రాశులలో ప్రవేశిస్తుంటాడు. ఈ అనంత విశ్వంలో జరిగే ప్రధాన సంఘటనల ఆధారంగా సూర్య చంద్ర గ్రహణాలు నక్షత్రాల కదలికలను భూగోళం మీద సమస్త సంస్కృతి సాంప్రదాయాలకు వైవిద్యమైన ఆయువుపట్టు. అటువంటి వాటిలో ఉత్తరాయణం అతి ముఖ్యమైనదిగా చెబుతుంటారు. సూర్యుడు నెలకొక నక్షత్ర రాశులు సంచరిస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆ నెలలో ఆ రాశి పేరు తో పిలుస్తారు .అదే సంక్రమణం సూర్యుడు ధనూరాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడమే మకర సంక్రమణం. మహాపర్వదినంగా మకర సంక్రాంతిగా జరుపుకుంటారు. 12 రాశుల సంక్రాంతి ఆశాడ మాసంలో వచ్చే మకర సంక్రమణం పుష్య మాసంలో వచ్చే మకర సంక్రమణం ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మొదటి సంక్రమణం దక్షిణాన్ని మకర సంక్రమణం ప్రారంభిస్తాయి. పుణ్యప్రదంగా భావిస్తారు. అందమైన రంగవల్లులతో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించే టప్పుడు చేసుకునే పండుగ మకర సంక్రాంతి పండగ. సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతి వచ్చిందంటే సందడే సందడే ఒకప్పుడు సంక్రాంతి పండుగకు వారం రోజుల ముందు నుండే పల్లెల్లో ఇంటింటా గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల సంకీర్తనలు పిల్లల ఆటలు తో పల్లెలన్నీ సందడిగా కనిపించేవి. కానీ నేడు గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల సంకీర్తనలు పూర్తిగా తగ్గిపోయాయి. ఎక్కడో ఒకచోట మాత్రమే గంగిరెద్దులు హరిదాసులు కనిపించే పరిస్థితి నెలకొంది. అయినా పండగను మాత్రం ముచ్చటగా మూడు రోజులపాటు ఆనందోత్సవాలతో జరుపుకుంటారు.

భోగి పండుగ ప్రత్యేకతలు…….
సంక్రాంతి పండుగలో మొదటి రోజు భోగి పండుగ జరుపుకుంటారు. ఈ నెల 13న శుక్రవారం భోగి పండుగ రోజున తెల్లవారు జామున భోగి మంటలు వేస్తారు. దక్షిణాయనంలో సూర్యుడు భూమి దక్షిణం వైపు కొద్దికొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవటం వల్ల భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజల కోసం భగభగమండే చలి మంటలు వేసుకుంటారు. చలి విపరీతంగా పెరగడం తట్టుకునేందుకు ఈ పండుగను భోగి పండుగ పిలుస్తుంటారు. కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న పాలమూరు జిల్లాలో బోగి పండుగ రోజున తెల్లవారు జామున నువ్వుల కట్టెలను ఒక దగ్గర కట్టి దానికి మంట పెట్టి కుటుంబ సభ్యులంతా ఒక చోట చేరి తమ చుట్టూ తిప్పుకుని భోగి పండుగను జరుపుకుంటారు. అదేవిధంగా పిండివంటలతో ప్రత్యేకమైన ఈ పండుగ రోజున సద్ద రొట్టెలు ప్రత్యేకం .నువ్వులు అంటించిన సద్ద రొట్టెలను తయారుచేసుకుని అన్ని రకాల కూరగాయలను( కలగూర) చేసుకుని కుటుంబసభ్యులంతా ఇష్టంగా తింటారు .ఇది భోగి పండుగ ప్రత్యేక వంటకం గా ఈ ప్రాంత ప్రజలు జరుపుకుంటారు. అదేవిధంగా రంగురంగుల రంగవల్లులతో అలంకరించి ఆవుపేడతో తయారు చేసిన గొబ్బిళ్ళను ఉంచి ఆడపడుచులు అంతా కలిసి పూజలు జరిపి ఆడుకుంటారు. పిల్లలకు భోగి పండ్లు పోయడం ఆనవాయితీగా వస్తోంది.
గంగిరెద్దుల సందడి………
సంక్రాంతి పండుగలో భాగంగా భోగి పండుగ రోజున గంగిరెద్దుల సందడి కూడా కొనసాగనుంది .గంగిరెద్దుల వాళ్ళు బాజాభజంత్రీలతో ఇంటింటికి వెళ్లి గంగిరెద్దుల విన్యాసాలతో ప్రజలను అలరించడం ఆనవాయితీగా వస్తోంది. గంగిరెద్దుల వాళ్లకు ప్రజలు తమకు తోచిన రీతిలో ధాన్యం కానుకగా అందజేస్తారు. అదేవిధంగా చిన్నపిల్లలు గాలిపటాలతో సందడి చేస్తుంటారు.
మకర సంక్రాంతి………
సంక్రాంతి పండుగ రెండవ రోజు జరుపుకునేది మకర సంక్రాంతి. మకర సంక్రాంతి రోజు తీపి వంటలు వండుకోవడం ఈ పండగ ప్రత్యేకత. నువ్వులు బెల్లం తో కలిపి అన్నం( పులగం) వండుకోవడం సంక్రాంతి ప్రత్యేక వంటకం. తీపిపదార్థాలు కుటుంబ సభ్యులంతా కలిసి భోజనం చేసి ఆనందంగా జరుపుకుంటారు. అదే విధంగా ఈ రోజున పవిత్ర నదీజలాలతొ పుణ్యస్నానాలు ఆచరించడం ఆనవాయితీగా వస్తోంది.
కనుమ పండుగ……..
సంక్రాంతి మూడవ రోజు కనుమ పండగ జరుపుకుంటారు .మూడు రోజుల పండుగ 3వ రోజు కనుమ పండుగ రోజు మాంసం వంటకాలు ప్రత్యేకం. రైతులు వేటకు వెళ్లి వేటాడిన జంతువులతో మాంసం వంటకాలు అదేవిధంగా నాటు కోళ్ల ను ప్రత్యేకంగా పండుగ వంటకంగా నిర్వహించడం ఈ పండుగ ప్రత్యేకత. మూడు రోజుల కోసం ముచ్చటగా పల్లె ప్రజలు గడుపుతారు. కోడిపందాలు ఈరోజు ప్రత్యేకతగా చెప్పవచ్చు. కొన్ని నెలలపాటు కోళ్లను పెంచి కనుమ పండుగ రోజు కోడిపందాలు ఆడి గెలిచిన కోడి తో ఆనందోత్సవాలమద్య కనుమ పండగను జరుపుకుంటారు.సంక్రాంతి పండగను ముచ్చటగా మూడు రోజుల పాటు ఉత్సవాలు జరుపుకోవడం విశేషం అని చెప్పవచ్చు.
