Chittoor | జిల్లాలో కార్డన్ సెర్చ్

Chittoor | జిల్లాలో కార్డన్ సెర్చ్
- 15ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్
Chittoor | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణను ప్రధాన లక్ష్యంగా నేరాలు, అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇవాళ ఉదయం జిల్లా వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పోలీసు అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఈ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో అనుమానాస్పద వ్యక్తులపై క్షుణ్ణంగా తనిఖీలు, వాహనాల పరిశీలన, నేరస్థుల కదలికలపై పర్యవేక్షణ, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టారు. ప్రజల్లో భద్రతా భావన పెంచడంతో పాటు నేరాలను ముందస్తుగా అరికట్టడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు.

ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్‌లో మొత్తం 15 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశారు. పత్రాలు లేకుండా తిరుగుతున్న వాహనాలు, నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై చర్యలు తీసుకున్నారు. నేరగాళ్లకు భయాన్ని కలిగించడంతో పాటు సామాన్య ప్రజలకు భద్రతా వాతావరణాన్ని కల్పించడమే ఈ చర్యల ఉద్దేశ్యమన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలను గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా రహస్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.

ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే పోలీసుల సహాయం పొందాలని సూచించారు. అదేవిధంగా రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచే దిశగా హెల్మెట్ అవేర్‌నెస్, రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని పోలీసులు సూచించారు.

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణాలకు ప్రమాదంగా మారుతుందని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు విభాగం సమన్వయం, స్థానిక ప్రజల సహకారంతో ఈ కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ విజయవంతంగా పూర్తయిందని అధికారులు తెలిపారు. ఇలాంటి తనిఖీలు భవిష్యత్తులో కూడా నిరంతరంగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.
