ఆలయాలకు ‘కార్తీక శోభ’

ఆలయాలకు ‘కార్తీక శోభ’

ఉదయం నుండే పోటెత్తిన భక్తులు
కిటకిటలాడిన భక్తులు


ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి, మహదేవపూర్, (ఆంధ్రప్రభ) : పరమ శివునికి ప్రీతికరమైన కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బుధవారం జయశంకర్ భూపాలపల్లి (Jayashankar Bhupalpally) జిల్లాలో పుణ్యక్షేత్రాలకు కార్తీక శోభ సంతరించుకుంది. జిల్లాలోని ప్రముఖ క్షేత్రాలైన శ్రీ కాళేశ్వర ముక్తిశ్వర దేవస్థానం, బుగులోని వెంకటేశ్వర్ల స్వామి ఆలయం, కొడవటంచ లక్ష్మి నర్సింహా స్వామి ఆలయం, నాపాక సర్వతో భద్ర ఆలయం, కోటగుళ్ళు, రెడ్డిగుడి, మలహార్ నైన గుళ్ళతో పాటు ఆయా గ్రామాల్లోని వివిధ దేవాలయాలకు తెల్లవారుజాము నుండే భక్తులు భారీగా తరలిరావడంతో ఆలయాలు కిటకిటలాడాయి. భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. మహిళలు తులసి, ఉసిరి కోటల వద్ద దీపారాధన చేసి, లక్ష వత్తులను వెలిగించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

కాళేశ్వరం లో కార్తీక శోభ…
కార్తీక పౌర్ణమి అనేది హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన మాసంగా పురాణాలు చెప్తున్నాయి. ఈ పవిత్రత, ఆచరణలు కార్తీక మాసం(karthika masam) లో వచ్చే పౌర్ణమి రోజున శివుడిని, విష్ణువును ఆరాధించడాన్ని ఎంతో శ్రేష్టంగా పరిగణిస్తారు. ఈ రోజున నది స్నానం చేసి ఒక్క దీపం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అలాగే ఈ పౌర్ణమి రోజు శివాలయాల్లో రుద్రాభిషేకం, మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, ఏకాదశ రుద్రాభిషేకాలను చేయించడం వల్ల ఆ పరమశివుడు ప్రసన్నుడై భక్తుల అభీష్టాలను తీరుస్తాడని గాడమైన విశ్వాసం.

కార్తీక పౌర్ణమి సందర్బంగా దక్షిణ అరణ్యశైవక్షేత్రముగా పేరుగాంచిన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి క్షేత్రం భక్తజన సంద్రోహంగా మారింది ప్రాతఃకాల సమయం నుండే భక్తులు మూడు నదులు కలయికైనా ముచ్చటైన త్రివేణి సంగమ గోదావరి నదికి పోటెత్తారు భక్తులతో గోదావరి నది జన సంద్రోహంగా మారింది. గోదావరి నదిలో భక్తులు పుణ్య స్నానం చేసి గోదావరి మాతకు చీరేసారే సమర్పించి అరటి డోప్పల్లో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు.

ఎంతో భక్తిశ్రద్ధలతో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకొని స్వామివారికి పాలాభిషేకాలు రుద్రాభిషేకాలు నిర్వహించారు. శ్రీ శుభనంద ( పార్వతి) అమ్మవారి ఆలయంలో కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తుల రాకతో ఆలయ ప్రాంగణమంతా పులకించిపోయింది స్వామివారి నామ కీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపారాధన, వనభోజనాలు వంటి కార్యక్రమాలు ప్రత్యేకంగా నిర్వహించారు.

ఉదయం ఆలయం నుండి వేద పండితులు మంగళ వాయిద్యాలతో బయలుదేరి గోదావరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కలశంలో గోదావరి జలాలను తీసుకువచ్చి శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి వారిని అభిషేకించారు ఈ రోజు నది స్నానం చేసినవారికి, దీపారాధన చేసినవారికి, శివవిష్ణువులను ఆరాధించినవారికి అనేక పుణ్యఫలాలు, శుభసంపదలు, పాపక్షయం కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ పూర్ణిమను పరమ పవిత్రమైన రోజు అనడంలో అర్థం, కార్యాచరణల్లో ఆధ్యాత్మికత, పుణ్యము పొందే అవకాశమే ప్రధానాంశం. ఈ నేపథ్యం వలన కార్తీక పౌర్ణమి అనేది భారతీయులకు విశిష్టమైన ఆధ్యాత్మిక ఉత్సవంగా, సంప్రదాయికంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది.

Leave a Reply