ముగ్గురు మృతి…ఐదుగురి పరిస్థితి విషమం

ముగ్గురు మృతి…ఐదుగురి పరిస్థితి విషమం

వంద మందికి పైగా గాయాలు
హోలగుంద లో చావు కేక
హైటెక్ గస్తీ చతికిల
పోలీసు కళ్ల ముందే..
కర్రల సమరం

( హోలగుంద / కర్నూలు, ఆంధ్రప్రభ బ్యూరో ): అరసాల పల్లకీలో ఊరేగే దేవతామూర్తుల పూజా ఉత్సవం, రక్తమోడే కర్రల సమరంగా మారింది. కర్నూలు జిల్లా హోలగుంద మండలంలోని దేవరగట్టు గ్రామంలో ప్రతీ ఏటా దసరా సందర్భంగా నిర్వహించే బన్నీ ఉత్సవం ఈసారి తీవ్ర హింసాత్మకంగా మారింది. మూడు గ్రామాల భక్తులు ఒకవైపు, ఏడుగ్రామాల భక్తులు మరోవైపు బద్దలయే కర్రలతో తలపడటంతో 100 మందికి పైగా గాయపడ్డారు. చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులను తక్షణమే ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మృతుల్లో ఒకరు హోలగుంద మండలం అరికెర గ్రామానికి చెందిన కోసిగి తిమ్మప్ప, ఆలూరు కి చెందిన నాగరాజు గా గుర్తించారు. మరొకరి వివరాలు తెలియాల్సి ఉంది.

అర్ధరాత్రి బన్నీ యాత్ర ఆరంభం

గురువారం అర్ధరాత్రి బన్నీ ఉత్సవం, భక్తిశ్రద్ధల నడుమ ప్రారంభమైనా, క్రమేపే ఉద్రిక్తతలకు దారి తీసింది. దేవతామూర్తులు మాళమ్మ, మల్లేశ్వరస్వామి విగ్రహాలను తమ గ్రామానికి తీసుకెళ్లాలనే పోటీ మధ్య భక్తుల గుంపులు పరస్పరం తలపడ్డాయి.

ఘర్షణ కేంద్రంగా మారిన క్షేత్రం

భక్తుల మధ్య తలెత్తిన కర్రల సమరం ఈ క్రింది గ్రామాల మధ్య సాగింది
నెరణికి, కొత్తపేట, నెరణికి తండా ఈ మూడు గ్రామాలు, బిలేహాల్, ఆలూరు, సులువాయి, ఎల్లార్తి గ్రామాలు రెండు వర్గాలుగా విడిపోయాయి. ఈ వర్గాల మధ్య ఘర్షణను అరికట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. .ఈసారి బన్నీ ఉత్సవానికి రెండు లక్షల మందికి పైగా భక్తులు తరలివచ్చారు. పర్వత ప్రాంతం, బాటలు సంకుచితంగా ఉండటంతో తలెత్తిన తోపులాట, ఉద్దండంగా ఉపయోగించిన కర్రలతో కొట్టుకున్న ఘటనలు తీవ్రతరంగా మారాయి.

800 మందితో భారీ బందోబస్తు

హింసాత్మక ఘటనలను అడ్డుకునేందుకు ముందస్తుగా 800 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ, పెద్ద ఎత్తున భక్తులు చేరుకోవడం, ఘర్షణ ఊహించదగిన స్థాయిలో ముదిరిపోవడంతో బందోబస్తు విఫలమయ్యినట్టు కనిపించింది.

హైటెక్ పర్యవేక్షణ చతికిల

ఘటన ప్రదేశంలో డ్రోన్ కెమెరాలు, ఫ్లడ్ లైట్లు, జూమ్ కెమెరాలు, వీడియో పర్యవేక్షణ గదులు ఏర్పాటు చేసినా, సమరాన్ని అరికట్టలేకపోయారు. వేడుకల్లో భద్రతా విభాగం చేతులెత్తేసింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా దేవరగట్టు వద్ద ఉత్సవాన్ని పర్యవేక్షించారు. అన్ని భద్రతా చర్యలు తీసుకున్నా, భక్తుల మూడ చర్యలు ముందు శాంతిభద్రతలు చిన్నబోయాయి. భక్తి ఉత్సవాల పేరుతో జరిగే కర్రల సమరంలో , ప్రాణ నష్టం అనాదిగా కొనసాగుతోంది. గతంలోనే ఉమ్మడి ఏపీలోని న్యాయస్థానం ఈ ఉత్సవాలను ఆక్షేపించింది. అప్పటినుంచి అటు పోలీస్ శాఖ, ఇటు రెవెన్యూ, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ తో పాటు వివిధ శాఖల అధికారులు నేతృత్వంలో బన్నీ ఉత్సవం సందర్భంగా అనేక చర్యలు చేపడుతున్నారు. నిర్వాహకులకు అవగాహన కల్పిస్తున్నారు. అయినప్పటికీ ఉత్సవం ప్రతి ఏటా హింసాత్మకం కావడం, ఒక రో, ఇద్దరు మృతి చెందడం బాధాకరం సర్వసాధారణమైంది.

Leave a Reply