Tollywood | పోటీలో ఉన్న సినిమాలివే
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ప్రపంచ సినీ రంగంలో అత్యంత గౌరవనీయమైన గుర్తింపుగా భావించే ఆస్కార్ అవార్డ్స్(Oscar Awards) కోసం ఈసారి తెలుగు సినిమా పరిశ్రమ బరిలోకి దిగింది. RRR ఆస్కార్ గెలుపుతో తెలుగు సినిమా చరిత్ర రికార్డులు(Records) సృష్టించింది. దీంతో భారత్ నుంచి ఈసారి అధికారిక నామినేషన్ సాధించేందుకు టాలీవుడ్(Tollywood) నుంచి ఏకంగా ఐదు సినిమాలు ఎంపిక దశలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
భారీ పాన్-ఇండియా అంచనాలతో తెరకెక్కిన చిత్రాలు మాత్రమే కాకుండా, విభిన్నకాన్సెప్ట్‌ల(Concepts)తో రూపొందిన సినిమాలు కూడా ఈ లిస్ట్‌లో చోటు దక్కించుకోవడం విశేషం. 2025 ఆస్కార్ అవార్డ్స్ కోసం భారతదేశం తరఫున పంపే చిత్రాన్నిఎంపిక చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ నేపథ్యంలో తెలుగు ఇండస్ట్రీ నుంచి ఐదు సినిమాలు(Movies) పరిశీలనలో ఉన్నాయి. వాటిలో ‘పుష్ప 2(Pushpa 2): ది రూల్’, ‘కుబేర’, ‘కన్నప్ప’ వంటి భారీ బడ్జెట్ ప్రాజెక్టు(Big Budget Project)లు ఉన్నాయి. ఈ చిత్రాలపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ భారీ సినిమాలతో పాటు, భిన్నమైన కథనం(Story)తో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా పరిశీలన జాబితాలో చేరడం ఆసక్తికర అంశం. అలాగే, డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) కుమార్తె సుకృతి వెని(Sukriti Veni) నటించిన ‘గాంధీ తాత చెట్టు’ చిత్రం కూడా ఈ పోటీలో చోటు దక్కించుకుంది.
యాక్షన్ డ్రామా, పౌరాణిక గాథలు, సామాజిక అంశాలు అన్నీకలగలిపి తెలుగు నుంచి ఐదు విభిన్నశైలీల చిత్రాలు ఆస్కార్ అవకాశాల కోసం పోటీపడటం గమనార్హం.
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా భిన్నభాషల్లో రూపొందిన సినిమాలను పరిశీలించి, వాటిలో ఒక్కదాన్నిమాత్రమే ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(Film Federation of India) అధికారికంగా ఎంపిక చేసి ఆస్కార్ అకాడమీకి పంపుతుంది. ఈసారి ఆ తుది రేసులో తెలుగు సినిమాలు బలంగా పోటీ ఇస్తుండటం టాలీవుడ్(Tollywood) ప్రతిష్ఠను మరింత పెంచే అంశంగా నిలుస్తోంది.

