గోదావరిఖని – రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత నిరుద్యోగ యువతీ యువకుల కోసం 60 వేల ఖాళీలను గుర్తించి భర్తీ చేయడం జరిగిందని , ఇటువంటి జాబు మేళాల నిర్వహణ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్ పేర్కొన్నారు. సింగరేణి ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ఆదివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని ఆయన రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , సింగరేణి సిఎండి ఎన్. బలరామ్ తో కలిసి ప్రారంభించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్క మల్లు నేతృత్వంలో యువత ఉద్యోగ నియామకాల తో పాటు రాజీవ్ యువ వికాసం మరియు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు ద్వారా నైపుణ్యాల ను పెంపొందిస్తూ, ఉపాధి కల్పనకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆశయాల కనుగుణంగా ప్రభుత్వ సంస్థ సింగరేణి సహకారంతో యువతకి ఉపాధి కల్పించేందుకు గోదావరి ఖని లో నిర్వహించిన ఈ జాబ్ మేళా కోసం హైదరాబాదు నుంచి 100 ప్రైవేట్ సంస్థలని ఇక్కడికి రప్పించిన సింగరేణి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో యువత ప్రపంచంలో ఏ మూలన ఉద్యోగ అవకాశాలు ఉన్నా సరే వాటినిఅందిపుచ్చుకోవాలని ,కేవలం స్థానికంగానే ఉపాధి కోసం ప్రయత్నిస్తే అవకాశాలు తక్కువగా ఉంటాయని వారు పేర్కొన్నారు .రాజీవ్ గాంధీ సివిల్స్ అభయస్తం కార్యక్రమం ద్వారా రాష్ట్రానికి చెందిన యువతకు సివిల్స్ ఆకాంక్షలను సాకారం చేసుకోవడంలో విజయవంతమయ్యామని గుర్తు చేశారు.
అలాగే ఒకప్పుడు ప్రముఖ నగరంగా ,పారిశ్రామిక కేంద్రంగా వెలుగొందిన గోదావరిఖని ప్రస్తుతం చిన్న పట్టణ స్థాయికి పడిపోయిందని ,మళ్లీ ఈ పట్టణాన్ని మహా నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని,ముఖ్యంగా సింగరేణి కాలరీస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నందున సింగరేణి సిటీగా గుర్తింపు తీసుకొచ్చేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.. సింగరేణి సహకారంతో రానున్న రోజుల్లో నగరంలో పలు కీలక మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని పేర్కొన్నారు .ప్రతి నిరుద్యోగి కూడా తమకు వచ్చిన అవకాశం వినియోగించుకుంటూ అంచెలంచెలుగా ఎదగాలని తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని అభిలాషించారు
సింగరేణి చైర్మన్ , ఎండి శ్రీ ఎన్ బలరాం మాట్లాడుతూ ఉద్యోగం లేని యువత కు సమాజంలో చిన్న చూపు ఉంటుందని , దాన్ని దూరం చేసి వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు జాబ్ మేళా లను ఏర్పాటు చేసినట్లు వివరించారు .రానున్న రోజుల్లో సింగరేణి అన్ని ఏరియాల్లో ఇలాంటి జాబ్ మేళాలను సామాజిక బాధ్యత కార్యక్రమంగా ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
అలాగే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత సింగరేణిలో 30 వినూత్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామని వివరించారు అలాగే సింగరేణిలో అవినీతి ప్రక్షాళనకు కఠిన చర్యలు తీసుకున్నామన్నారు ముఖ్యంగా శ్రమజీవులైన కార్మికులను మోసగిస్తున్న అక్రమార్కులను కటకటాల వెనక్కి పంపిస్తున్నామని వివరించారు.
మున్ముందు కూడా కార్మికులను మాయమాటలతో మోసగించే వారిని, వేధించే వారిని వదిలిపెట్టబోమన్నారు అలాగే సాయంత్రం జాబ్ మేళా ఫలితాలను వెల్లడిస్తూ మొత్తం 5100 మంది యువత హాజరుకాగా అందులో 3029 మందికి ఉద్యోగాలు వచ్చాయన్నారు
ఈ కార్యక్రమంలో గుర్తింపు , ప్రాతినిధ్య, అధికారుల సంఘ నాయకులు రాజ్ కుమార్, సదానందం, నరసింహులు , ఏరియా జీఎం లలిత్ కుమార్ మాట్లాడారు .జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారికి ముఖ్య అతిథులు శ్రీహర్కర వేణుగోపాల్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , ఎన్. బల రామ్ నియామక పత్రాలు అందజేశారు .హైదరాబాద్ కంపెనీలను గోదావరిఖనికి తీసుకువచ్చి తమ పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి స్థానికులు ధన్యవాదాలు తెలియజేశారు..