Excise Duty War | డొనాల్డ్ ట్రంప్ కు కెనడా, మెక్సికో లు షాక్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కెనడా, మెక్సికో దేశాలు షాకిచ్చాయి. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటూ డొనాల్డ్ ట్రంప్ దూకుడుగా పాలన సాగిస్తున్నారు. పలు దేశాల దిగుమతులపై పన్నుల భారాన్ని పెంచుతామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై 25శాతం సుంకం విధించే ఆర్డర్లపై ట్రంప్ సంతకం చేశారు.
ట్రంప్ చైనా నుండి అన్ని దిగుమతులపై 10శాతం, మెక్సికో, కెనడా నుంచి దిగుమతులపై 25శాతం సుంకాలు విధించాలని ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశారు. అయితే, కెనడా నుంచి దిగుమతి చేసుకునే ఇంధనం, చమురు, సహజ వాయువు, విద్యుత్ పై 10శాతం పన్ను విధించారు
ట్రంప్ నిర్ణయం పట్ల కెనడా, మెక్సికో దేశాలు ఆగ్రహంతో ఉన్నాయి. ఈ క్రమంలో ట్రంప్ కు కెనడా బిగ్ షాకిచ్చింది. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో 155 బిలియన్ కెనడియన్ డాలర్ల విలువైన అమెరికా దిగుమతులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు జస్టిన్ ట్రూడో ప్రకటించారు.
త్వరలోనే మెక్సికన్ ప్రెసిడెంట్ క్లాడియా షీన్ బామ్ తో మాట్లాడతానని తెలిపారు. అయితే, మెక్సికో సైతం కెనడా బాటలోనే నడిచేందుకు సిద్ధమైంది. తాము కూడా అమెరికా దిగుమతులపై టారిఫ్ లు విధిస్తామని ఆ దేశ అధ్యక్షురాలు క్లాడియా షేన్ బామ్ పేర్కొన్నారు.
మెక్సికో పొరుగు రాష్ట్రాల సహకారం కోరుకుంటుంది.. ఘర్షణ కాదు. మాదకద్రవ్యాలను అరికట్టాలని అమెరికా ప్రభుత్వం నిర్ణయించుకుంటే అందుకు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని, టారిఫ్ లు విధిస్తే సమస్యలు పరిష్కారం కావని షేన్ బామ్ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ట్రంప్ తన నిర్ణయం మార్చుకోకపోతే ప్లాన్-బి ని అమలు చేయాలని ఆర్థిక కార్యదర్శిని ఆదేశిస్తున్నట్లు షేన్ బామ్ ట్వీట్లో పేర్కొన్నారు.