Kaleshwaram Project | కాళేశ్వరంపై అసెంబ్లీలో చర్చిద్దాం

కేసీఆర్‌కు పొంగులేటి సవాల్

Kaleshwaram Project | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేవాదుల ప్రాజెక్టు పరిశీలన అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బారేజీల పిల్లర్ల అంశంపై అసెంబ్లీలో విస్తృత చర్చకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వమే నిర్మించిందని, అదే ప్రభుత్వ హయాంలో మూడు బారేజీల్లో పిల్లర్లు దెబ్బతిన్నాయని మంత్రి ఆరోపించారు. ఈ అంశంపై ఒక్కో బారేజీకి ఒక్కో రోజు చొప్పున అసెంబ్లీలో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఫామ్‌హౌస్‌లో కూర్చొని రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేయకుండా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరగలేదని ప్రజలకు వివరణ ఇవ్వాలని పొంగులేటి సవాల్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అంశాలపై సభలో బహిరంగ చర్చ జరగాలని, ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా వివరించడానికి సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు.