సీఎం ములుగు పర్యటనకు ఏర్పాట్లు వేగవంతం
6వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
వరద పరిస్థితులు, అభివృద్ధి పనులపై కలెక్టరేట్లో మంత్రి సీతక్క సమీక్ష సమావేశం
ములుగు, ఆంధ్రప్రభ ప్రతినిధి : రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా పర్యటనకు రానున్న నేపథ్యంలో ఏర్పాట్లు వేగవంతం చేయాలని, 6000 కొట్ట నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టనున్నారని రాష్ట్ర పంచాయతీ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఈ మేరకు సోమవారం ములుగు జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితులు, ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జిల్లాలో చేపట్టనున్న పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.మేడారం అభివృద్ధి పనులు, పెండింగ్లో ఉన్న పనులను వచ్చే పది రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. త్వరలో ముఖ్యమంత్రి మేడారం, ములుగు జిల్లాల్లో పర్యటించనున్నారని, ఈ పర్యటనలో సమ్మక్క–సారలమ్మలను దర్శించుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రూ.6,000 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి ప్రారంభం పలకనున్నారని మంత్రి వెల్లడించారు.ఘట్టమ్మ సమీపంలో పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ములుగు కలెక్టరేట్ భవనం, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, కేంద్ర విద్యాలయం సహా పలు అభివృద్ధి పనుల ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. సీఎం పర్యటన తేదీని త్వరలో ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు.
