రైల్వేలో చోరీ కేసు ఛేదించిన పోలీసులు…

రైల్వేలో చోరీ కేసు ఛేదించిన పోలీసులు…

రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఐఫోన్లు స్వాధీనం
తమిళనాడుకు చెందిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
తిరుపతి–విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుల బ్యాగుల చోరీ..
విజయవాడ జీఆర్పీ ప్రత్యేక దర్యాప్తు..
పూర్తి స్థాయిలో రికవరీ.. నిందితుల అరెస్టు..

విజయవాడ, ఆంధ్రప్రభ : తిరుపతి–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో జరిగిన భారీ చోరీ కేసును విజయవాడ ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్పీ) సమర్థవంతంగా ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేయడంతో పాటు దాదాపు రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, ఖరీదైన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రైల్వే ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ పోలీసులు చేపట్టిన వేగవంతమైన దర్యాప్తు ఫలితంగా ఈ కేసులో కీలక పురోగతి సాధించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకు చెందిన, ప్రస్తుతం ఖతార్‌లో నివసిస్తున్న నంబూరి రాధాకృష్ణ మోహన్‌రావు తన భార్య శ్రీదేవితో కలిసి తిరుపతి దర్శనం అనంతరం ఏప్రిల్ 7న తిరుపతి–విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలులో భీమవరం ప్రయాణమయ్యారు.

ఏప్రిల్ 8 తెల్లవారుజామున విజయవాడ రైల్వే స్టేషన్‌కు రైలు చేరుకున్న సమయంలో కోచ్ ఏ–1లోని వారి బెర్తుల వద్ద ఉంచిన హ్యాండ్‌బ్యాగ్, ల్యాప్‌టాప్ బ్యాగ్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. చోరీకి గురైన బ్యాగుల్లో సుమారు 140 గ్రాముల బంగారు ఆభరణాలు, వజ్రాల హారం, రూబీ నెక్లెస్, ఐఫోన్లు, నగదు, పాస్‌పోర్టులు, ఆధార్ కార్డులు, బ్యాంకు లాకర్ తాళాలు తదితర విలువైన వస్తువులు ఉండటంతో బాధితులు వెంటనే ఫిర్యాదు చేశారు. దీనిపై విజయవాడ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సాంకేతిక ఆధారాలు, నిఘా బృందాల సమాచారంతో కేసును లోతుగా విచారించిన పోలీసులు తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లా పుంగనూరు ప్రాంతానికి చెందిన హరిహరన్ చంద్రశేఖరన్ ను బుధవారం విజయవాడ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారం నంబర్–7 ఉత్తర వైపు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి వద్ద నుంచి చోరీకి గురైన 140 గ్రాముల బంగారు ఆభరణాలు, ఐఫోన్, ఖరీదైన చేతి గడియారం స్వాధీనం చేసుకున్నారు.

మొత్తం రికవరీ విలువ సుమారు రూ.15 లక్షలుగా పోలీసులు అంచనా వేశారు. ఈ కేసును విజయవంతంగా ఛేదించి బాధితులకు విలువైన ఆస్తులను తిరిగి అందించేందుకు చర్యలు చేపట్టిన విజయవాడ జీఆర్పీ పోలీసుల పనితీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. రైల్వే స్టేషన్లు, రైళ్లలో నేరాల నియంత్రణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేస్తున్నామని అధికారులు తెలిపారు.