ముఖ్యమంత్రి, గవర్నర్ పర్యటనలకు సర్వం సిద్ధం
ముఖ్యమంత్రి, గవర్నర్ పర్యటనలకు సర్వం సిద్ధం
- ఏఎస్‌ఎల్ సమావేశంలో భద్రత, ప్రోటోకాల్ ఏర్పాట్లపై సమగ్ర సమీక్ష
- జూన్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లా పర్యటన
- జూన్ 9 నుంచి 11 వరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ మూడు రోజుల పర్యటన
- చిన్నపాటి లోపాలకు కూడా తావు ఉండకూడదన్న కలెక్టర్
- వైద్య, విద్యుత్, అగ్నిమాపక, ఆహార భద్రత ఏర్పాట్లపై ప్రత్యేక ఆదేశాలు
- పక్కాగా బందోబస్తు నిర్వహించాలని పోలీసు అధికారులకు ఎస్పీ సూచన
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గవర్నర్ అబ్దుల్ నజీర్ తిరుపతి జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ నెల 9న సీఎం చంద్రబాబు నాయుడు తిరుపతి జిల్లాలో పర్యటించనుండగా, ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు మూడు రోజుల పాటు గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. ప్రముఖుల పర్యటనల్లో ఎలాంటి చిన్నపాటి లోపాలు చోటుచేసుకోకుండా అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. ఆదివారం సాయంత్రం రేణిగుంట విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన అడ్వాన్స్ సెక్యూరిటీ లైజన్ (ఏఎస్‌ఎల్) అధికారుల సమన్వయ సమావేశంలో జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావుతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి, గవర్నర్ పర్యటనల సందర్భంగా చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు, ప్రోటోకాల్ అంశాలు, వివిధ శాఖల సమన్వయంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, గవర్నర్ పర్యటనలకు సంబంధించి అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని చెప్పారు. పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తమకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషలిస్ట్ డాక్టర్లను అందుబాటులో ఉంచాలని, సేఫ్ రూమ్ ఏర్పాటు చేయాలని, అధునాతన లైఫ్ సపోర్ట్ అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైన రక్త గ్రూపుల రక్త నిల్వలు, మందులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారులు ఫైర్ ఇంజిన్‌లతో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
పొరపాట్లు లేకుండా ప్రోటోకాల్
ప్రముఖులకు అందించే ఆహారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు నిబంధనల ప్రకారం పరీక్షించాలని ఆదేశించారు. ఏపీ ఎస్పీడీసీఎల్ అధికారులు విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. కాన్వాయ్‌లో వినియోగించే వాహనాలు మంచి స్థితిలో ఉండేలా ముందుగానే పరిశీలించాలని తెలిపారు. ప్రముఖులకు భోజన, తాగునీటి ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని, రేణిగుంట విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలని ఎయిర్‌పోర్టు అధికారులను ఆదేశించారు. ప్రోటోకాల్ అంశాలకు సంబంధించి ఎలాంటి పొరపాట్లు జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని, కేటాయించిన విధుల్లో నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని డీఎస్ఓకు సూచించారు.
బందోబస్తు కట్టుదిట్టం
జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ పోలీసు శాఖ తరఫున బందోబస్తు కట్టుదిట్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఇంటెలిజెన్స్ అధికారి వెంకటరాముడు, అడిషనల్ ఎస్పీలు రవి మనోహరాచారి, వెంకటరావు, నాగభూషణరావు, వెంకటరాముడు, తిరుపతి, శ్రీకాళహస్తి ఆర్‌డీఓలు రామ్మోహన్, భానుప్రకాశ్ రెడ్డి, ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ భూమినాథన్, సీఐఎస్‌ఎఫ్ అధికారి అనురాగ్ యాదవ్, ఐబీ అధికారి శిరీష, డీఎస్పీలు రామకృష్ణాచారి, చంద్రశేఖర్, భక్తవత్సలం, రామకృష్ణ, చిరంజీవి, ప్రసాద్, రాంబాబు, అంకారావు, వెంకటనారాయణ, డీఎఫ్‌ఓ రమణయ్య, ఇంటెలిజెన్స్ అధికారి నాగబాబు, ఆర్టీఓ మురళీమోహన్, డీఎస్ఓ రాజు, డీఎంహెచ్‌వో బాలకృష్ణ నాయక్, జిల్లా పంచాయతీ అధికారి సుశీలాదేవి, ఆర్ అండ్ బి ఎస్‌ఈ రాజానాయక్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగమల్లేశ్వరరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, డీఐపీఆర్వో గురుస్వామి చెట్టి, రేణిగుంట తహశీల్దార్, ఇన్‌స్పెక్టర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
