Agriculture Drones | సాగు పనులకు ఆన్‌లైన్‌లో డ్రోన్ బుకింగ్

Agriculture Drones | సాగు పనులకు ఆన్‌లైన్‌లో డ్రోన్ బుకింగ్

Agriculture Drones | కూలీల కొరతకు అధునాతన సాంకేతిక పరిష్కారం
రైతుల కోసం ప్రత్యేక డ్రోన్ సేవల యాప్
స్వర్ణాంధ్ర విజన్‌లో భాగంగా డ్రోన్ పాలసీ

Agriculture Drones | అమరావతి, ఆంధ్రప్రభ: సాగు పనుల్లో వినియోగానికి డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసులుబాటు కలిగింది. సాంకేతికతను రైతులు అందిపుచ్చుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వ్యవసాయ పనులపై ఆసక్తి లేక యువత నగరాలు, పట్టణాల బాట పడుతున్న నేపథ్యంలో కూలీల కొరత రైతులను వేధిస్తోంది. రానురాను పంట సాగుపై ఆసక్తి తగ్గుతోంది. అన్ని రంగాల్లో డిజిటల్ టెక్నాలజీ సరికొత్త విప్లవానికి నాంది పలుకుతోంది. వ్యవసాయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధునాతన సాంకేతికత వైపు అడుగులు వేస్తోంది.

దుక్కులు దున్నే దగ్గర నుంచి మొక్కలు నాటేవరకు, ఆ తర్వాత ఎరువులు, క్రిమిసంహారక మందుల పిచికారీ, విత్తనాలు నాటడం, పంట పర్యవేక్షణ, పొలాల మ్యాపింగ్, పంట ఆరోగ్య అంచనా తదితర వ్యవసాయ కార్యకలాపాలకు కూలీల కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయంలో డ్రోన్ల లభ్యత అందుబాటులోకి వచ్చినా, అందరూ కొనుగోలు చేసి వినియోగించాలంటే కష్టతరంగా మారింది. ముఖ్యంగా చిన్న, సన్నకారు, కౌలు రైతులకు వ్యవసాయం వ్యయప్రయాసలకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో డిజిటల్ ప్లాట్‌ఫాంపై రైతులకు డ్రోన్ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించి అమల్లోకి తీసుకువచ్చింది.

పొలాల వద్దకే డ్రోన్లు

సంధాన కిసాన్ డ్రోన్ యాప్, లేదంటే ఫార్మర్ యాప్‌లో ఈ వివరాలున్నాయి. ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ (ఎపీడీసీ) సంధానకర్తగా ఈ యాప్ నిర్వహణ చేపట్టింది. డ్రోన్ సర్వీసులు అవసరమైన రైతులు తమ మొబైల్ ఫోన్‌లో యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని, తమకు నచ్చిన కంపెనీ నుంచి తమకు అవసరమైన సర్వీసుల కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. డ్రోన్ సేవలు అందించే ప్రైవేటు కంపెనీలు ఈ యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకుంటాయి. ఎపీడీసీ ఈ కంపెనీల అర్హతలను నిర్ణయించి యాప్‌లో చేరుస్తుంది.

సదరు కంపెనీలు తాము అందించే సర్వీసుల వివరాలను, యూజర్ ఛార్జీలను యాప్‌లో వెల్లడిస్తాయి. డ్రోన్ అందించే ఆయా సేవకు, విస్తీర్ణానికి, సమయానికి ఇంత ఛార్జి అని పేర్కొంటాయి. ఎరువులు, క్రిమిసంహారక మందుల పిచికారీ, విత్తనాలు నాటడం, పంట పర్యవేక్షణ, పొలాల మ్యాపింగ్, పంట ఆరోగ్య అంచనా తదితర వ్యవసాయ కార్యకలాపాల సమాచారం కంపెనీల వారీగా యాప్‌లో నిక్షిప్తమవుతుంది.

రైతులు కోరిన సేవ అందించేందుకు సమ్మతిస్తే, కంపెనీలు ఏ రోజు ఎన్ని గంటలకు డ్రోన్ పొలం వద్దకు చేరుకుంటుందో యాప్‌లో తెలియజేస్తాయి. ఆ ప్రకారం రైతుకు డ్రోన్ సర్వీసులు అందించి యూజర్ ఛార్జీలు వసూలు చేస్తాయి. డ్రోన్ల ప్రయాణ లొకేషన్లు, సమయం, దూరం, అందుకు చేసే ఛార్జి, చెల్లింపులు తదితర వివరాలు యాప్‌లో అందుబాటులో ఉంటాయి.

విస్తారంగా డ్రోన్ సేవలు

మోదీ ప్రభుత్వం వికసిత భారత్ 2047కు కొనసాగింపుగా టీడీపీ కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్-2047 ప్రణాళికను రూపొందించింది. విజన్ లక్ష్యంగా వచ్చే ఐదేళ్లకు డ్రోన్ పాలసీని ప్రకటించింది. డ్రోన్ సేవలను విస్తారంగా వివిధ తరగతుల ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎపీడీసీ ప్రణాళికలు వేస్తోంది. తొలి దశలో రైతులను ఎంచుకుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద రైతులకు డ్రోన్ల సరఫరాతోపాటు సేవలనూ అందించేందుకు సంధానకర్తగా వ్యవహరిస్తోంది.

రైతుల్లో అవగాహన

డ్రోన్ సేవలను రైతులు విరివిగా వినియోగించుకునేలా వ్యవసాయశాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం తరచూ రైతులకు డ్రోన్ సేవలపై కార్యక్రమాలను కొనసాగిస్తోంది. సబ్సిడీపై డ్రోన్లను సైతం అందజేస్తున్నారు. అందులో భాగంగా ప్రతి రైతు సేవా కేంద్రం (ఆర్ఎస్‌కే) సిబ్బంది తమ పరిధిలోని రైతులందరితో వారి మొబైల్ ఫోన్లలో డ్రోన్ సేవల యాప్‌ను ఇన్‌స్టాల్ చేయించాలని నిర్దేశించారు.

Leave a Reply