Nirmal | ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తుల ప్రతిజ్ఞ

Nirmal | ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తుల ప్రతిజ్ఞ

లక్ష్మణచాంద్, ఆంధ్రప్రభ : ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామస్తులంతా అండగా నిలుస్తూ తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు కాకుండా ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తామని బాబాపూర్ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు శనివారం గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో అందరూ ప్రతిజ్ఞ చేశారు.

మండలంలోని బాబాపూర్ గ్రామంలో విద్యాభివృద్ధి అంశంపై నిర్వహించిన గ్రామసభకు గ్రామ సర్పంచ్ పడిగేలా లక్ష్మి అంజయ్య, ప్రధానోపాధ్యాయురాలు సుజాత అధ్యక్షత వహించారు. గ్రామస్తులు, తల్లిదండ్రులు, విద్యా కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని సంకల్పించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ విద్య, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని తల్లిదండ్రులకు సూచించారు.

గ్రామసభలో పాఠశాలలో విద్యార్థుల నమోదు శాతం పెంపు, ప్రతి చిన్నారిని బడిలో చేర్పించడం, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించడం, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడం వంటి పలు కీలక తీర్మానాలు చేశారు.

సర్పంచ్ పడిగేలా లక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడంలో ప్రతి తల్లిదండ్రి భాగస్వామి కావాలని కోరారు. ప్రధానోపాధ్యాయురాలు సుజాత మాట్లాడుతూ.. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి అవసరమైన అన్ని సౌకర్యాలు పాఠశాలలో అందుబాటులో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఉంచాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఉప్పుల సురేష్, మాజీ సర్పంచ్ తునికి నారాయణ, బాణాల రాజేశ్వర్, మాజీ ఎంపీపీ తునికి రాజేశ్వర్, పంచాయతీ కార్యదర్శి చందు, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిష్టయ్య, అంగన్‌వాడీ సిబ్బంది బాణాల ఉజ్వల, వార్డు సభ్యులు, వీడీసీ సభ్యులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Leave a Reply