Dear Humans… ఒకసారి కూర్చుని మాట్లాడుకుందామా? – మీ ‘భూమి’ రాసిన లేఖ!
“ప్రియమైన మనుషులారా… మీరు కార్పొరేట్ ఆఫీసులో ఏసీ కింద కూర్చున్నా, ట్రాఫిక్‌లో బైక్‌పై వెళ్తున్నా, ఇంట్లో ఫోన్ స్క్రీన్‌లో మునిగిపోయినా… నా గుండె వేడి మీకు తగులుతూనే ఉంది. నేను మీతో ఎప్పుడూ గొడవపడను, మీపై కోపం చూపించను, డిబేట్లు పెట్టను. కానీ నేను మౌనంగా కొన్ని సంకేతాలు మాత్రం ఇస్తూనే ఉంటాను. గ్లేసియర్లు (మంచు కొండలు) కరుగుతుంటే, ఎండలు రికార్డులు బద్దలు కొడుతుంటే, ఊహించని వరదలు నగరాలను ముంచెత్తుతుంటే, అడవులు మంటల్లో కాలిపోతుంటే… అవన్నీ నా బాధను మీకు చెప్పే ప్రయత్నాలే. ఒకప్పుడు మీకు స్వచ్ఛమైన గాలి ఇచ్చిన చెట్లు ఇప్పుడు మీ గొడ్డళ్ల కింద పడిపోతున్నాయి. మీ దాహాన్ని తీర్చిన నదులు ప్లాస్టిక్‌తో ఊపిరాడక విలవిల్లాడుతున్నాయి. మీ అభివృద్ధి కోసం మీరు నిర్మిస్తున్న కాంక్రీట్ అడవుల మధ్య నా అసలు అడవులు కనుమరుగైపోతున్నాయి.
అయినా నేను మీపై నిందలు వేయను, మీరు నన్ను కాపాడండి అని అడగను… మీరు మీ భవిష్యత్తునే కాపాడుకోవాలి అని అడుగుతున్నా… ఈ పర్యావరణ దినోత్సవం నాడు నాకు ‘Happy Environment Day’ అని వేలాది మెసేజ్‌లు పప్తారు. ఆ మరుసటి రోజు మర్చిపోతారు. దానికి బదులుగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. ఒక మొక్క నాటండి. ఒక చెట్టును కాపాడండి. అవసరం లేని వాహన ప్రయాణాన్ని మానండి. నీటిని వృథా చేయకుండా చూసుకోండి. మీ పిల్లలకు ప్రకృతిని ప్రేమించడం నేర్పించండి. అదే నాకు మీరు ఇచ్చే అత్యంత విలువైన బహుమతి.
ఎందుకంటే నేను కేవలం మట్టి, నీరు, గాలి కలయిక కాదు… మీ ఊపిరిని, మీ జీవితాన్ని, మీ పిల్లల కోసం మీరు కలలు కంటుంన్న రేపటిని మోస్తున్న తల్లిని. గుర్తుంచుకోండి… మీరు లేకపోయినా నేను ఉండగలను. కానీ నేనే లేకపోతే…”
అందుకే ఒక్కసారి స్క్రీన్‌ల నుంచి బయటకు వచ్చి నా వైపు చూడండి. నేను ఇంకా మీ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను. ప్రేమతో… మీ భూమి.
ఇది కేవలం ఒక ఊహాత్మక లేఖ మాత్రమే కాదు. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్న వాస్తవ పరిస్థితులకు ప్రతిబింబం. భూమి మనతో నిజంగా మాట్లాడలేకపోవచ్చు. కానీ వాతావరణ మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, తరచూ సంభవిస్తున్న ప్రకృతి వైపరీత్యాలు మాత్రం అదే సందేశాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. భూమి అనేది మనం వారసత్వంగా పొందిన ఆస్తి కాదు.. భావితరాల నుంచి అరువుగా తీసుకున్న బాధ్యత. మన గత తరాలు భూమిని వినియోగించుకున్నాయి.. మనం వినియోగిస్తున్నాం.. రేపటి తరాలు కూడా ఇదే భూమిపై జీవించాల్సి ఉంది. అందుకే పర్యావరణ పరిరక్షణ అనేది కేవలం జూన్ 5న మొక్కలు నాటి ఫొటోలు దిగడం, సోషల్ మీడియాలో ఆకట్టుకునే క్యాప్షన్లు పెట్టడం వరకే పరిమితం కాకూడదు. మార్పు మనలో మొదలుకావాలి.
ఉదయం కళ్లు తెరిచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు… మన చూపు ఫోన్ స్క్రీన్‌పైనే ఉంటంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇదే పరిస్థితి. సోషల్ మీడియా, వీడియోలు, గేమ్స్, సందేశాల మధ్య నిజమైన జీవితాన్ని మెల్లగా మర్చిపోతున్నాం. పక్షుల కిలకిలరావాలు వినే సమయం లేదు… చెట్ల నీడలో కూర్చునే అలవాటు లేదు… కుటుంబంతో, స్నేహితులతో హృదయపూర్వకంగా మాట్లాడే క్షణాలు కూడా తగ్గిపోతున్నాయి. కృత్రిమ ప్రపంచంలో ఆనందాన్ని వెతుక్కుంటూ, నిజమైన ప్రశాంతతను కోల్పోతున్నాం. ప్రకృతితో మళ్లీ మమేకం కావడానికి, పచ్చదనాన్ని ఆస్వాదించడానికి, మనసుకు విశ్రాంతినిచ్చే జీవనశైలిని అలవర్చుకోవడానికి ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఒక అద్భుతమైన సందర్భం. ఒక్కరోజైనా మొబైల్, ల్యాప్‌టాప్, టీవీలకు కాస్త దూరంగా ఉండండి. కుటుంబంతో కలిసి ఒక చెట్టు నాటండి.
మీ పిల్లలను కేవలం కాంక్రీట్ అడవుల్లోనే కాకుండా, పర్యావరణానికి దగ్గరగా పెంచండి. భూమి పట్ల బాధ్యతను కూడా వారికి నేర్పండి. అలాగే, పెద్దల చర్యల ద్వారానే పిల్లలు స్ఫూర్తి పొందుతారనే విషయాన్ని మర్చిపోవద్దు. కిరాణా షాప్‌కు వెళ్లేటప్పుడు బైక్ తీసే బదులు కాస్త నడిచి వెళ్లే అలవాటు చేసుకుందాం. సంతకో, మార్కెట్ కో వెళ్లినప్పుడు ప్లాస్టిక్ కవర్ల స్థానంలో క్లాత్ బ్యాగ్‌ను వెంట తీసుకెళ్దాం. మన ఇళ్లలో చెత్త నిర్వహణ సక్రమంగా జరుగుతోందో లేదో పరిశీలించుకుందాం. నీటిని వృథా చేయకుండా జాగ్రత్త వాడుకుందాం. ప్రకృతిని కాపాడటం అంటే పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహించడం కాదు.. ప్రతిరోజూ చిన్న చిన్న అలవాట్లలో మార్పు తీసుకురావడమే. ఎకో-ఫ్రెండ్లీ జీవనశైలిని అలవర్చుకోవాలి. పర్యావరణం పట్ల సెల్ఫ్ అవేర్నెస్ పెంచుకోవాలి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పర్యావరణాన్ని కాపాడగలదా?
పర్యావరణం అంటే చాలామందికి గుర్తొచ్చేది చెట్లు, అడవులు, నదులు మాత్రమే. కానీ 2026లో ప్రపంచం పర్యావరణ పరిరక్షణను మరింత విస్తృత కోణంలో చూస్తోంది. మనం వాడే విద్యుత్ వ్యవస్థలు, పరిశ్రమలు, రవాణా రంగం, డేటా సెంటర్లు, నగరాల నిర్వహణ… ఇవన్నీ కూడా పర్యావరణంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. అందుకే ఇప్పుడు ప్రశ్న ఒక్కటే… ప్రకృతిని కాపాడటంలో టెక్నాలజీ ఎంతవరకు సహాయపడగలదు?
ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో “AI for Climate Action” ప్రధాన అంశంగా నిలుస్తోంది. ఒకప్పుడు కేవలం చాట్‌బాట్లు, ఆటోమేషన్, డేటా విశ్లేషణకే పరిమితమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇప్పుడు వాతావరణ మార్పులను ఎదుర్కొనే కీలక సాధనంగా మారుతోంది. విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించడం నుంచి కార్బన్ ఉద్గారాలను తగ్గించే వ్యూహాలను రూపొందించడం వరకు AI తన ముద్ర వేస్తోంది.
ఉదాహరణకు, AI ఆధారిత స్మార్ట్ గ్రిడ్‌లు విద్యుత్ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేసి అనవసర వ్యర్థాన్ని తగ్గించగలవు. పరిశ్రమల్లో యంత్రాల పనితీరును విశ్లేషించి విద్యుత్ వినియోగాన్ని తగ్గించగలవు. వాతావరణ డేటాను అధ్యయనం చేసి వరదలు, కరువులు, అరణ్యాగ్నులపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వగలవు. దీంతో ప్రకృతి వైపరీత్యాల ప్రభావాన్ని తగ్గించే అవకాశం ఉంటుంది.
మరోవైపు ప్రపంచం ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ వంటి రంగాలపై భారీగా దృష్టి సారిస్తోంది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని AI సహాయంతో మరింత సమర్థవంతంగా వినియోగించడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అంటే పర్యావరణ పరిరక్షణ అనేది ఇక కేవలం మొక్కలు నాటడమే కాదు… డేటా, డిజిటల్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు సహాయంతో భూమికి తక్కువ నష్టం కలిగించే జీవన విధానాన్ని నిర్మించడం కూడా. అయితే AI ఒక్కటే పరిష్కారం కాదు. ప్రకృతిని కాపాడాలనే సంకల్పం మనుషుల్లో ఉండాలి.
