మండే ఎండలలో.. ఉపాధి కూలీలతో వరంగల్ కలెక్టర్
ఉమ్మడి వరంగల్, ఆంధ్రప్రభ ప్రతినిధి : మండే ఎండలను సైతం లెక్కచేయకుండా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జాతీయ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలిస్తూ కూలీలకు ఆరోగ్యపరమైన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నారు.
గురువారం సంగెం మండలం చింతలపల్లి గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్, అక్కడ ఉపాధి హామీ పథకం కింద కొనసాగుతున్న పనులను పర్యవేక్షించారు. ఎండలో పలుగు, పార పట్టి పనిచేస్తున్న కూలీలతో మమేకమై వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో తగినంత నీరు తాగడం, తలపై రక్షణ కోసం టోపీలు లేదా గుడ్డలు ఉపయోగించడం, ఎండ ప్రభావం నుంచి జాగ్రత్తలు తీసుకోవడం వంటి అంశాలపై కూలీలకు సూచనలు చేశారు.
అనంతరం ఉపాధి హామీ కూలీలకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలు, పనుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై ఆరా తీశారు. పనులు నాణ్యతతో నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
