IPL Finals | నిప్పులు చెరిగిన ఆర్‌సీబీ బౌలర్లు..

IPL Finals | నిప్పులు చెరిగిన ఆర్‌సీబీ బౌలర్లు..
- గుజరాత్ టైటాన్స్ బెంబేలు!
ఐపీఎల్ 2026 ఫైనల్ మహా సంగ్రామంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బౌలర్లు అద్భుత ప్రదర్శనతో అదరగొట్టారు. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ టైటిల్ పోరులో ఆర్‌సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.
కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ ఆర్‌సీబీ బౌలర్లు షార్ట్ పిచ్ బంతులతో గుజరాత్ టైటాన్స్ (GT) బ్యాటర్లను ఊపిరి సలపనీయకుండా చేశారు. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్‌ను 8 వికెట్ల నష్టానికి 155 పరుగులకే కట్టడి చేశారు. ఆర్‌సీబీ రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలంటే ఇప్పుడు 120 బంతుల్లో 156 పరుగులు చేయాల్సి ఉంది.
అయితే, గుజరాత్ టైటాన్స్ జట్టుకు కొండంత బలంగా భావించిన ‘బిగ్ 3’ శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, జోస్ బట్లర్ ఈ కీలక ఫైనల్లో ఘోరంగా ఫేయిల్ అయ్యారు. ఆర్‌సీబీ బౌలర్ల పక్కా ప్లానింగ్ ధాటికి వీరిలో ఎవరూ కూడా కనీసం 20 పరుగుల మార్కును కూడా దాటలేకపోయారు.
ఇన్నింగ్స్ 2.2 ఓవర్లలోనే 22 పరుగుల వద్ద గుజరాత్‌కు తొలి షాక్ తగిలింది. కెప్టెన్ గిల్ 10 పరుగులు చేసి జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో పాటిదార్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. గిల్ అవుటైన కొద్దిసేపటికే మరో ఇన్-ఫామ్ ఓపెనర్ సాయి సుదర్శన్ 12 పరుగులు చేసి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో 26 పరుగులకే గుజరాత్ ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో క్రీజులోకి వచ్చిన స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ 19 పరుగులు చేసి ఎక్కువ సేపు నిలబడలేకపోయాడు. అతను కృనాల్ పాండ్య బౌలింగ్‌లో స్టంప్ అవుట్ అయి పెవిలియన్ చేరాడు.
మిడిల్ ఓవర్లలో ఆర్‌సీబీ బౌలర్ రాసిఖ్ సలామ్ గుజరాత్ కోలుకోకుండా దెబ్బతీశాడు. అతను నిశాంత్ సింధు (20), రాహుల్ తెవాటియా (7), రషీద్ ఖాన్ (7) వికెట్లను పడగొట్టి గుజరాత్ లోయర్ ఆర్డర్ నడుం విరిచాడు.
మరోవైపు అర్షద్ ఖాన్ 15 పరుగులు చేసి ఆర్‌సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేసినప్పటికీ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వేసిన అద్భుతమైన స్పెల్‌తో జేసన్ హోల్డర్ 7 పరుగులకే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ వికెట్‌తో భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్ ‘పర్పుల్ క్యాప్’ (Purple Cap) రేసులో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడం విశేషం.
ఒకదశలో ఘోర పరాజయం వైపు వెళ్తున్న గుజరాత్ జట్టును ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఒంటరి పోరాటంతో ఆదుకున్నాడు. ఆర్‌సీబీ బౌలింగ్ ఎటాక్‌ను తట్టుకుని ఒంటరి పోరాటం చేస్తూ అద్భుతమైన హాఫ్ సెంచరీ (50 నాట్ అవుట్) సాధించాడు. దాంతో గుజరాత్ 155 పరుగుల గౌరవప్రదమైన స్కోరైనా చేయగలిగింది. ఇన్నింగ్స్ ముగిసే సమయానికి కాగిసో రబడా 3 పరుగులతో నాట్ అవుట్‌గా ఉన్నాడు.
ఆర్‌సీబీ బౌలర్లలో రాసిఖ్ సలామ్ 3 వికెట్లు పడగొట్టగా, భువనేశ్వర్ కుమార్, జోష్ హాజిల్‌వుడ్ తలో రెండు వికెట్లు, కృనాల్ పాండ్య ఒక వికెట్ సాధించారు.
