రూ.3.5 కోట్ల కేంద్ర నిధులతో కొడిమ్యాల మండలంలో చేసిన అభివృద్ది పనులను పరిశీలించిన మంత్రి
కొడిమ్యాల, ఆంధ్రప్రభ : రాజకీయాలకు అతీతంగా కొడిమ్యాల మండలంతో సహా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేద్దామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ఎన్నికల వరకే రాజకీయాలని, ఎన్నికల తరువాత ప్రజల అభ్యున్నతే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
మంగళవారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని శివాజీ విగ్రహం నుండి అంగడి బజార్ వరకు రూ.65 లక్షలతో నిర్మించిన రోడ్డును ప్రారంభించారు. దీంతో పాటు కొడిమ్యాల మండల కేంద్రంలో రూ.3 కోట్ల 50 లక్షల కేంద్ర నిధులతో నిర్మిస్తున్న వివిధ రోడ్లు, అభివృద్ధి పనులను పరిశీలించారు. వీటిలో 23 లక్షల 50 వేల రూపాయల ఎంపీ లాడ్స్ నిధులు కాగా, మిగిలినవన్నీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులే అన్నారు. రూ.2 కోట్ల 59 లక్షలతో మండలంలోని వివిధ గ్రామ పంచాయతీల్లో సీసీ రోడ్లు, ఎంపీ లాడ్స్ నిధులతో కిచెన్ షెడ్, కమ్యూనిటీ హాల్స్, పీఏసీఎస్ భవనాల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ది కోసం రాజకీయాలకు అతీతంగా కలిసికట్టుగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మెడికల్ సత్యం, మాజీ ఎమ్మెల్యే బొడిగ శోభతో పాటు పలువురు పాల్గొన్నారు.