అంగరంగ వైభవంగా వాసవిమాత జయంతి..

అంగరంగ వైభవంగా వాసవిమాత జయంతి..
తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ఆలయంలో ప్రత్యేక పూజలు
జై వాసవి.. జై జై వాసవి” నినాదాలతో మార్మోగిన పట్టణం
సామూహిక కుంకుమార్చనలు, లలిత సహస్రనామ పఠనం
వేడుకలకు భారీగా హాజరైన భక్తులు
సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ : సంగారెడ్డి పట్టణంలో వాసవి మహా సంస్థాన్ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో వాసవి కన్యకా పరమేశ్వరి జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ అతిథి గృహం వద్ద జెండా ఊపి బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టారు. ఈ బైక్ ర్యాలీ కొత్త బస్టాండ్, కలెక్టరేట్ మీదుగా పాత బస్టాండ్ చేరుకుని, అక్కడి నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వరకు కొనసాగింది. “జై వాసవి.. జై జై వాసవి” నినాదాలతో పట్టణం మారుమోగింది. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్‌పర్సన్ నిర్మలరెడ్డి పాల్గొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలు సామూహికంగా కుంకుమార్చనలు చేసి, లలిత సహస్రనామ పారాయణం చేశారు. తరువాత అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కలెక్టరేట్‌లో అధికారిక వేడుకలు..
రాష్ట్ర ప్రభుత్వం వాసవి కన్యకా పరమేశ్వరి జయంతిని అధికారికంగా గుర్తించిన నేపథ్యంలో, సంగారెడ్డి కలెక్టరేట్‌లో కూడా జయంతి వేడుకలు నిర్వహించారు. వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ సూపరింటెండెంట్ ఆర్.విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్ణచందర్, కార్యదర్శి నామా భాస్కర్, వాసవి మహా సంస్థాన్ కోశాధికారి జూలకంటి మల్లేశం, వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ పుల్లూరి ప్రకాష్, చందా శ్రీధర్, ఇరుకుల ప్రదీప్ కుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మ్యాడం రాధాకిషన్, జూలకంటి బుచ్చిలింగం తదితరులు పాల్గొన్నారు.

