జనగణన కార్యక్రమం జాగ్రత్తగా నిర్వహించాలి..

జనగణన కార్యక్రమం జాగ్రత్తగా నిర్వహించాలి..
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
చెన్నూర్, ఆంధ్రప్రభ : జనగణన -2027 కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు ఇండ్ల గణనపై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి మండల తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జనగణన కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఇండ్ల గణన కార్యక్రమాన్ని నిబంధనల ప్రకారం చేపట్టాలని, జిల్లాలో గుర్తించబడిన ఇండ్ల జాబితా బ్లాక్ వివరాలను అందించడం జరుగుతుందని తెలిపారు.
మే 11వ తేదీ నుండి నిర్వహించనున్న ఇండ్ల గణన కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని తెలిపారు. రోజురోజుకు ఉష్ణోగ్రత తీవ్రమవుతున్న దృష్ట్యా ఉదయం వేళలో ప్రక్రియ నిర్వహించేలా కార్యచరణ రూపొందించుకోవాలని తెలిపారు. తమ జాబితాలోని ఇండ్ల గణన కొరకు ముందుగా ఆయా ఇండ్ల యజమానులకు సమాచారం అందించినట్లయితే సమయానికి అందుబాటులో ఉంటారని, పంచాయతీ కార్యదర్శి, మున్సిపల్ కమిషనర్ సమన్వయంతో ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.
ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమయపాలన పాటించాలని, ఇండ్ల గణన కొరకు నియమించబడిన అధికారులు ఎన్నికల విధులు నిర్వహించారని, అనుభవంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రక్రియ నిర్వహించాలని తెలిపారు.
మాస్టర్ ట్రైనర్లు అందిస్తున్న శిక్షణలో ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవాలని, క్షేత్రస్థాయిలో ప్రక్రియ నిర్వహించే సమయంలో తలెత్తే సందేహాల నివృత్తి కొరకు గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఈ శిక్షణకు హాజరు కాని వారు తరువాత ఏర్పాటు చేసే శిక్షణ కార్యక్రమానికి హాజరై ఇండ్ల గణన ప్రక్రియపై అవగాహన పొందాలన్నారు.
