ఎంత ద్రోహం?.. ఎంత నిర్లక్ష్యం?

ఎంత ద్రోహం?.. ఎంత నిర్లక్ష్యం?
- త్యాగాలపై నిలిచిన రాష్ట్రం
- త్యాగధనులకే, న్యాయం ఎప్పుడు
- ఉద్యమకారుల ఆవేదన గళం
- అమర వీరుల కు టుంబాల కన్నీటి కథలు
నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు పణంగా పెట్టిన ఉద్యమకారుల పరిస్థితి నేటికి ప్రశ్నార్థకంగా మారిందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన తెలంగాణ ఉద్యమం త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో, అదే ఉద్యమకారులు గుర్తింపు లేకుండా, సంక్షేమం లేకుండా, అనాదరణలో జీవిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
రాష్ట్రం ఎవరి పుణ్యంతో వచ్చింది? ఎవరి త్యాగాలతో సాధ్యమైంది? అనే ప్రశ్నలు మళ్లీ మళ్లీ వినిపిస్తున్నాయి. అమరుల త్యాగాలపై అధికారం చేపట్టిన రాజకీయ పార్టీలు, నాయకులు ఉద్యమకారుల సమస్యలను విస్మరించడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ప్రజాప్రతినిధులు, మంత్రులు, వివిధ పార్టీల నాయకులు సభల్లో ఉద్యమకారుల అంశాన్ని ప్రస్తావించినప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పష్టమైన చర్యలు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి స్పందనపై ఉద్యమ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
గత కొన్నేళ్లుగా ఉద్యమకారుల హక్కుల కోసం తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నిరంతరం పోరాటం కొనసాగిస్తోందని, కానీ ప్రభుత్వ స్థాయిలో సరైన స్పందన లేకపోవడం వల్ల నిరాశ నెలకొందని నాయకులు పేర్కొంటున్నారు.
ఉద్యమకారుల పట్ల పెరుగుతున్న నిర్లక్ష్యాన్ని తట్టుకోలేక, మరింత శక్తివంతమైన పోరాటానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నారు. ఇప్పుడే నడుము బిగించకపోతే ఇంకెప్పుడూ అవకాశం రాదు అని వారు అన్నారు.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ 18న హైదరాబాద్లోని తార్నాక ప్రాంతంలో ఉన్న మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్ లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి ఉద్యమకారుల సమస్యలకు పరిష్కారం సాధించాలనే లక్ష్యంగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఉద్యమ స్ఫూర్తిని మరోసారి జ్వలింపజేసే ఈ సమావేశానికి అన్ని వర్గాల ఉద్యమకారులు, మద్దతుదారులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబారావు పిలుపునిచ్చారు. తెలంగాణ సాధనలో ప్రజల శక్తి, ఐక్యత ఎంతటి మార్పును తీసుకురాగలదో మరోసారి చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు అభిప్రాయపడ్డారు.
