విద్యార్థి కాళ్లకు సంకెళ్లు వేసిన ఉపాధ్యాయులు..

విద్యార్థి కాళ్లకు సంకెళ్లు వేసిన ఉపాధ్యాయులు..

అల్లరి చేస్తున్నాడని ఈ అమానుష సంఘటన..
ఇనుప గొలుసుతో చెక్క మొద్దు కు కట్టి తాళం వేసిన వైనం..
జిల్లాలో తీవ్ర కలకలం రేపిన సంఘటన…
మొద్దు నిద్రలో విద్యాశాఖ..
విద్యాశాఖ అధికారులకు తెలిసిన పట్టించుకోని వైనం…

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ : మానవత్వాన్ని మంట కలిపే దారుణమైన సంఘటన నంద్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నంద్యాల జిల్లా బనగానపల్లె పట్టణంలోని మదరసా సెంటర్లో చదువుకుంటున్న 11 సంవత్సరాల బాలుడు అల్లరి చేస్తున్నాడని ఇనుప గొలుసుతో పెద్ద మొద్దుకు కాలికి కట్టి తాళం వేసిన సంఘటన చోటుచేసుకుంది. ఆడుతూ పాడుతూ చదువుకోవలసిన వయసులో పాఠశాలలో ఆ బాలుడికి కాలికి ఇనుప సంకెళ్లతో తాళం వేసి పెద్ద మొద్దుకు కట్టి వేసిన సంఘటనతో జిల్లాలో పలువురు విద్యాభిమానులు ఆశ్చర్యం, ఆందోళన వ్యక్తం చేస్తున్నాం.

ఆ 11 సంవత్సరాల చిన్నారి బాలుడు తాళం వేసిన ఆ మొద్దుతోనే బజారులోకి ఈడ్చుకుంటూ రావటం గమనించిన ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని ఈద్గా నగర్ కు చెందిన షేక్ హుస్సేన్ అనే పదకొండు సంవత్సరాల బాలుడు ఓ మదరస సెంటర్లో చదువుతున్నాడు. అల్లరి చేస్తున్నాడన్న నెపంతో ఆ బాలుడిని ఇనుప గొలుసుతో పెద్ద మొద్దుకు కట్టి కాలికి కట్టి తాళం వేశారు.

ఆ బాలుడు ఆ బాధని తట్టుకోలేక అలాగే ఇనుప గొలుసుతో కట్టిన తాళం వేసిన మొద్దుతో బజారులోకి ఈడ్చుకుంటూ వచ్చాడు. దీనిని చూసిన ప్రజలు ఆశ్చర్యంతో వీడియోలు తీశారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ అధికారులకు తెలిసిన ఏమాత్రం పట్టించుకోకపోవడం విశేషం. ఈ సంఘటనపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు కూడా ఫిర్యాదు చేశారు.

ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగిస్తుంది. మదరస సెంటర్లలో ఇలాంటి సంఘటనలు జరగటం చిన్నారులు మానసికంగా కృంగిపోవటం జరుగుతుందని విద్య నిపుణులు పేర్కొంటున్నారు.సిఐ జరిగిన సంఘటనను తెలుసుకొని స్టేషన్కు పిలిపించారు. అయినప్పటికీ ఇలాంటి సంఘటనలు చేయటం చట్టరీత్య నేరంగా పరిగణించబడతాయన్నారు.

11 సంవత్సరాల చిన్నారి చదువు నేపముతో కాలికి ఇనుప గొలుసు మొద్దుకు కట్టి తాళం వేయటం వంటి సంఘటన సభ్య సమాజానికి సిగ్గుచేటని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. ఈ సంఘటన జిల్లాలోని మండలాల్లోని విద్యాశాఖ అధికారులకు తెలిసిన ఏమాత్రం పట్టించుకోవటం లేదని విద్యా అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సంఘటనపై పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్ లోతైన దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

Leave a Reply