ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తిస్తే..

ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తిస్తే..
- రోడ్డు ప్రమాద రహిత సమాజాన్ని నిర్మించవచ్చు
- పెద్దపెల్లి డిసిపి భూక్యా రామ్ రెడ్డి
- గోదావరిఖనిలో రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన
గోదావరిఖని, ఆంధ్రప్రభ : ప్రజల సహకారం లేకుండా ఏది సాధ్యం కాదని… ప్రతి ఒక్కరూ బాధ్యతతో ప్రవర్తిస్తే.. రోడ్డు ప్రమాదరహిత సమాజాన్ని నిర్మించవచ్చని పెద్దపెల్లి జిల్లా డిసిపి భూక్య రామ్ రెడ్డి అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాల నివారణ సురక్షితమైన ప్రయాణం కోసం స్థానిక ఇందిరానగర్ కాలనీలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్దపల్లి డిసిపి భూక్య రామిరెడ్డి, నగర మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డిసిపి రామ్ రెడ్డి మాట్లాడుతూ.. రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ నియమాలు పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అందరూ కలిసి పని చేస్తేనే ప్రమాదాలను తగ్గించవచ్చు అని తెలిపారు. పోలీసులు ఈ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి రహిత ప్రాంతంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని డీసీపీ హామీ ఇచ్చారు.
ఏసీపీ మడత రమేష్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి వాహనం పై బయలుదేరి పని ముగించుకుని మరల తిరిగి ఎలా అయినా కాదు.. ప్రాణాలతో ఇంటికి సురక్షితంగా చేరుకోవాలి” అన్నారు. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన పలు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్ల నిర్లక్ష్యమేనని తెలిపారు. ర్యాష్ డ్రైవింగ్, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్ బెల్ట్ ధరించకపోవడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం, సెల్ ఫోన్ ఉపయోగించడం వంటి చర్యలు ప్రమాదాలకు దారి తీస్తున్నాయని చెప్పారు.
మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ.. గంజాయి, మత్తు పదార్థాల వినియోగం పై ఆందోళన వ్యక్తం చేశారు. యువత తప్పుడు మార్గంలో వెళ్లి కుటుంబాలను నష్టపరిచే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ఇందిరానగర్, సంజయ్ గాంధీనగర్ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందని పోలీసు వారు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని నిర్లక్ష్యమైన డ్రైవింగ్ చేస్తూ ప్రాణాలను కోల్పోయి గాయాలపాలై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఈ అనూష, బ్లూ క్లోట్స్, పెట్రో కార్ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రజలు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
