60 లక్షలతో స్మశాన వాటిక అభివృద్ధి

60 లక్షలతో స్మశాన వాటిక అభివృద్ధి
నేడు ప్రారంభించనున్న రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి
పామర్రు – ఆంధ్రప్రభ : గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో స్మశాన వాటికలు సరిగా లేకపోవడంతో అంత్యక్రియలు చేసుకునేందుకు పలువురు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఆఖరి మజిలీలో జరిగే కార్యక్రమాలు మంచిగా నిర్వహించుకునేందుకు స్మశాన వాటిక వద్ద సౌకర్యాలు కల్పించారు. తండ్రి, కొడుకులు సుమారు రూ.60 లక్షల నిధులతో స్మశాన వాటికను అభివృద్ధి పరచగా, శనివారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శనివారం ప్రారంభోత్సవం చేయనున్నారు.
పామర్రు మండలం జుఝువరం మైనర్ పంచాయతీలో శ్మశాన వాటిక అధ్వానంగా దర్శనమిస్తూ అంత్యక్రియలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. విజయవాడ – మచిలీపట్నం జాతీయ రహదారి వెంబడే ఉన్నప్పటికీ ప్రభుత్వ సహకారం లేక, పంచాయతీలో నిధుల లేమి కారణంగా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. సమస్యను గుర్తించిన సర్పంచి పుట్టి పున్నమ్మ భర్త రామ్మోహనరావు, ఆయన కుమారుడు రామకృష్ణారావు సొంత నిధులు రూ.60 లక్షలు వెచ్చించి అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. ఏడు నెలల కిందట పనులు మొదలు పెట్టగా చివరి దశకు చేరింది. ఇప్పటికే దహనశాల, విశ్రాంతి, స్నానపు గదులు, చుట్టూ ఫెన్సింగ్, ముఖద్వారం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పనులు పూర్తయ్యాయి. దీంతో శనివారం రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా స్మశానను ప్రారంభించి అభివృద్ధి పనులు వీక్షించనున్నట్లు దాతలు తెలిపారు. అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు 60 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టిన తండ్రి, కుమారులను పలువురు గ్రామస్తులు, కూటమి నేతలు అభినందనలు తెలియజేస్తున్నారు.

