HYD | వైన్‌షాపు దగ్ధం

HYD | వైన్‌షాపు దగ్ధం
HYD |ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని సోమాజిగూడలో భారీ అగ్నిప్రమాదం కలకలం రేపింది. ఇవాళ తెల్లవారుజామున రాజ్‌భవన్ రోడ్డులో ఉన్న ఓ వైన్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. షాపులో మద్యం బాటిళ్లు ఉండటంతో తొందరగానే మంటలు అంతా వ్యాపించాయి. ఆ ప్రాంతమంతా పొగ అలుముకుంది.
స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో రెండు ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. షాపు మూసివున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే మద్యం స్టాక్, ఫర్నిచర్ భారీగా దగ్ధమయ్యాయి. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు పోలీసులు, ఫైర్ సిబ్బంది అంచనా వేస్తున్నారు. పాత వైరింగ్ సమస్యలే ఈ దుర్ఘటనకు కారణమని భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నష్టం విలువ, ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
