మహిళల భద్రత గాలికి..

మహిళల భద్రత గాలికి..
హామీల అమలులో ప్రభుత్వం విఫలం
అభయహస్తం హామీలు ఏమయినట్లు?
మాలగురుజాల సదస్సులో ఏఐడీడబ్లుఏ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమాన్ని ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఏఐడీడబ్లుఏ) రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆశలత విమర్శించారు. ఆదివారం బెల్లంపల్లి మండలం మాలగురిజాలలో ఏఐడీడబ్లుఏ కమిటీ ఆధ్వర్యంలో ‘మహిళా సమస్యలు-పరిష్కారాలు’ అనే అంశంపై నిర్వహించిన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అభయహస్తం పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మహిళలను నడిరోడ్డుపై నిలబెట్టిందని ధ్వజమెత్తారు.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం, రూ. 4,000 పెన్షన్ పథకాలు నేటికీ అమలుకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర వస్తువులు, గ్యాస్ ధరల పెరుగుదలతో సామాన్య గృహిణి బతుకు భారంగా మారిందని మండిపడ్డారు. అంగన్వాడీ, మిడ్-డే మీల్ వర్కర్ల వేతనాల పెంపుపై ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, మహిళలపై పెరుగుతున్న వేధింపులను అరికట్టడంలో పోలీస్ వ్యవస్థ విఫలమైందని విమర్శించారు. హక్కుల సాధన కోసం మహిళలంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐడీడబ్లుఏ నాయకులు కమల కుమారి, ఉమారాణి, సరిత, మమత, అరుణ తదితరులు పాల్గొన్నారు.

