విద్యా కమిషన్ సిఫారసులు ఆక్షేపణీయం

విద్యా కమిషన్ సిఫారసులు ఆక్షేపణీయం

  • టీఎస్‌పీఆర్టీయూ

ఉట్నూర్, ఆంధ్రప్రభ: ఆకునూరి మురళి అధ్యక్షతన ఏర్పాటు చేసిన రాష్ట్ర విద్యా కమిషన్‌ను స్వాగతిస్తున్నప్పటికీ, ఉపాధ్యాయుల జీతభత్యాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొనడం, ఆటోమేటిక్ ప్రమోషన్లను రద్దు చేయాలని సిఫారసు చేయడం ఆక్షేపణీయమని టీఎస్‌పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఆడే ప్రకాష్ అన్నారు.

ఆదివారం అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా నాయకుడు బండి విజయ్‌కుమార్‌తో కలిసి ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల పనితీరును ఆధారంగా తీసుకుని ప్రమోషన్లు ఇవ్వాలని, పనితీరు సరిగా లేని వారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని ప్రభుత్వానికి సిఫారసు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.

దేశంలో, రాష్ట్రంలో గతంలో ఏర్పాటైన విద్యా కమిషన్లు విద్యా అభివృద్ధిపై దృష్టి సారించాయని, ఉపాధ్యాయుల వృత్తి అభివృద్ధి శిక్షణలు, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అనుకూల వాతావరణం, సరళమైన బోధనా పద్ధతులు, ఆకర్షణీయ పాఠ్యపుస్తకాలు వంటి అంశాలపై ప్రణాళికలు రూపొందించాయని గుర్తుచేశారు. అయితే ప్రస్తుత కమిషన్ మాత్రం విద్యా వ్యవస్థ కంటే ఉపాధ్యాయులపై విమర్శలకు ప్రాధాన్యం ఇచ్చిందని వాపోయారు.

ఇప్పటికే ఐదు కరువు భత్యాలు, పీఆర్‌సీ, జీపీఎఫ్, మెడికల్ బిల్లులు, సరెండర్ లీవ్స్, హెల్త్ కార్డులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యలపై స్పందించకుండా కొత్త వివాదాలు సృష్టించడం సరికాదన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు మెరుగైన విద్యావిధానం అందించేందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందని తెలిపారు. వివాదాస్పద సిఫారసులను వెంటనే ఉపసంహరించుకుని కమిటీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో ఉట్నూర్, సిర్పూర్, నేరెడు గొండ మండలాల టీఎస్‌పీఆర్టీయూ నాయకులు ఆడే జవీందర్, ఏనుగుల భూమన్న, జాదవ్ సంజయ్, మెస్రం బాదు, జాదవ్ జగదీశ్, పవార్ ఉదారం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply