Handri-Niva | హంద్రీనీవా కాలువ పనులు వేగవంతం

Handri-Niva | హంద్రీనీవా కాలువ పనులు వేగవంతం

195 చెరువులను నింపడమే లక్ష్యం
జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ స్పష్టం

Handri-Niva | శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ : పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలో సాగుతున్న హంద్రీ-నీవా సుజల స్రవంతి (HNSS) కాలువ పనులను వేగవంతం చేసి, మొత్తం 195 చెరువులను నీటితో నింపడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ తెలిపారు. గురువారం ఆయన HNSS అధికారులతో కలిసి కాలువ మార్గం, పంప్ హౌస్‌లు, రెగ్యులేటర్ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హంద్రీ-నీవా ప్రధాన కాలువలో 344.90 కిలోమీటర్ వద్ద (జానకంపల్లి–పుట్టపర్తి రహదారి సమీపంలో) సాగుతున్న పనులను కలెక్టర్ తనిఖీ చేశారు.

కాలువ వెడల్పు, నీటి నిల్వ సామర్థ్యం, ప్రవాహ వేగం వంటి సాంకేతిక అంశాలపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా HNSS ఎస్.ఈ. రాజ్‌స్వరూప్ ప్రాజెక్టు ప్రస్తుత పురోగతి, మిగిలిన పనులపై సమగ్ర వివరణ ఇచ్చారు. కాలువలోని OT-3 (343.250 కి.మీ) రెగ్యులేటర్ వద్ద పనులను ప్రత్యేకంగా పరిశీలించిన కలెక్టర్, ఈ నిర్మాణం ద్వారా సుమారు 143 చెరువులకు నీరు అందించే అవకాశముందని పేర్కొన్నారు.

Handri-Niva |

ఆ కారణంగా ఈ రెగ్యులేటర్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని, ఎటువంటి ఆలస్యం లేకుండా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. చెరువుల నింపుదల సమయానికి పూర్తయితే రైతులకు సాగునీరు సమృద్ధిగా అందుతుందని తెలిపారు. జానకంపల్లి వద్ద ఉన్న పంప్ హౌస్-3, యార్డ్ పనులను కూడా ఆయన సమీక్షించారు. అక్కడ అమర్చుతున్న భారీ పైపుల నాణ్యత, వాటిపై వేస్తున్న కోటింగ్ పెయింట్ మందం (థిక్నెస్), వెల్డింగ్ ప్రమాణాలను స్వయంగా పరిశీలించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలకు ఏమాత్రం రాజీ పడకూడదని, భవిష్యత్తులో సాంకేతిక లోపాలు తలెత్తకుండా కచ్చితమైన ప్రమాణాలు పాటించాలని అధికారులకు స్పష్టం చేశారు.

Handri-Niva | భూగర్భ జలాలు పెరగడానికి ఇది కీలకం

ప్రాజెక్టు ద్వారా పుట్టపర్తి నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు చెరువుల ద్వారా పరోక్షంగా సాగునీరు అందుతుందని, భూగర్భ జలాలు పెరగడానికి ఇది కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. చెరువులు నిండితే పంటల ఉత్పత్తి పెరగడమే కాకుండా, తాగునీటి సమస్య కూడా కొంతవరకు పరిష్కారమవుతుందని తెలిపారు. పనుల పురోగతిని ప్రతి దశలో సమీక్షిస్తామని, అవసరమైతే అదనపు యంత్రాలు, సిబ్బందిని వినియోగించి గడువులోగా పూర్తి చేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, అధికారుల మధ్య సమన్వయం పెంచాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, HNSS ఎస్.ఈ. రాజ్‌స్వరూప్, ఈ.ఈ. గిరిధర్ రెడ్డి, ఏ.ఈ.ఈ.లు ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply