కళ పై మక్కువ ఎక్కువైతే..

కళ పై మక్కువ ఎక్కువైతే..
టేకుమట్ల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని వెలిశాల గ్రామానికి చెందిన తూర్పాటి శ్రీకృష్ణ గర్మిళ్లపల్లిలో అసిస్టెంట్ లైన్మెన్ గా విధులు నిర్వహిస్తూ కళా రంగంలో రాణిస్తున్నారు. ఉద్యోగానికి ముందు టీవీ, సినిమా రంగాలలో రాణించారు. అనంతరం కష్టపడి ఉద్యోగం సాధించారు. అయినా సంతృప్తి చెందక కళ పై ఉన్న అభిమానంతో విద్యుత్ సంస్థ నిర్వహిస్తున్న పోటీలలో పాల్గొని కళామాతల్లి ముద్దుబిడ్డగా రాణిస్తూ అందరి ప్రశంసలని అందుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో మరియు తెలంగాణ డిస్కమ్స్ నిర్వహించిన సాంస్కృతిక పోటీలలో వల్లంపట్ల నాగేశ్వరరావు రచించిన, నర్సంపేట లైన్మెన్ రాజేందర్ గౌడ్ దర్శకత్వం వహించిన తల కొరవి అనే నాటికలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రాధాన్యం వహించి రాష్ట్రస్థాయిలో నిర్వహించిన పోటీలలో ద్వితీయ బహుమతి పొందారు.
ఈ క్రమంలో టేకుమట్ల సెక్షన్ ఉద్యోగి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ బహుమతి పొందడంతో ఏఈ అంబీరు మణిదీప్, తోటి ఉద్యోగులు ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్రస్థాయి పోటీలలో అనేక మంది ఉద్యోగులు పాల్గొనిన శ్రీకృష్ణ చేసిన ఏకపాత్రాభినయం, ఫాన్సీ డ్రెస్, డాన్సు, వంటి అద్భుతాలు కలిగిన పాత్రలను పోషిస్తూ అందరి మెప్పును పొందుతున్నాడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ మాట్లాడుతూ.. సినిమా రంగంలో రాణించి ఉన్నత స్థాయికి ఎదుగుతూ, కళా రంగంలో రాణించి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
