ద్విచక్రవాహనదారులకు హెచ్చరిక

చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుంటే పెట్రోల్ బంకుల్లో ఇంధనం ఇవ్వకూడదని చిట్యాల పోలీసులు మంగళవారం స్టిక్కర్లు అంటించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు, జిల్లా వ్యాప్తంగా చేపట్టిన ‘Arrive Alive’ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని పెట్రోల్ బంకుల వద్ద హెల్మెట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఆదేశాలతో మండలంలోని నాలుగు ప్రధాన పెట్రోల్ బంకుల్లో చిట్యాల పోలీస్ కానిస్టేబుళ్లు అస్లాం, లాల్ సింగ్ స్టిక్కర్లు అతికించారు.
ఈ సందర్భంగా ఎస్ఐ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ లేని వాహనదారులకు పెట్రోల్ పోయకూడదని బంక్ యజమానులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు, వాహనదారుల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజలు, పెట్రోల్ బంక్ యజమానులు పోలీసులకు సహకరించి ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
