Kondapally | కళాకారులకు మరింత బలం..

Kondapally | కళాకారులకు మరింత బలం..
- బలోపేతానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌తో అవగాహన ఒప్పందం..
- సంప్రదాయ కొండపల్లి కళలకు ఆధునిక రూపు…
- డిజైన్, బ్రాండింగ్, మార్కెట్ అనుసంధానంతో కొత్త అవకాశాలు…
Kondapally | ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రభ : ప్రసిద్ధ కొండపల్లి కళాకారుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది. విజయవాడలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ మధ్య కళాకారుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పంద కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ శ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ జి. కృష్ణన్, సిబ్బంది, కొండపల్లి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సొసైటీ అధ్యక్షులు ఉదయగిరి సూర్యప్రకాశ్, కమిటీ సభ్యులు పరస్పరం అవగాహన పత్రాలను మార్పిడి చేసుకున్నారు.
ఈ ఒప్పందం ద్వారా కొండపల్లి కళాకారులకు నిరంతర మార్గనిర్దేశం (హ్యాండ్‌హోల్డింగ్), సంప్రదాయ నైపుణ్యాల అభివృద్ధి, ఉత్పత్తుల ఆవిష్కరణ మరియు రూపకల్పన (డిజైన్ డెవలప్‌మెంట్), బ్రాండింగ్, ప్యాకేజింగ్, మార్కెట్ అనుసంధానాలు, నైపుణ్య శిక్షణ, సాంకేతిక సహాయం, మౌలిక వసతుల మద్దతు వంటి అంశాలపై దృష్టి సారించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం ద్వారా కొండపల్లి కళలకు ఆధునికతను జోడిస్తూ, సంప్రదాయ వారసత్వాన్ని కాపాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమే ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు వెల్లడించారు. దీంతో కొండపల్లి కళాకారులకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు వారి ఉత్పత్తులకు కొత్త మార్కెట్లు లభించనున్నాయని వ్యక్తంచేశారు.
