9thcentury | కడెం తీరంలో పురాతన ఆలయం గుర్తింపు

9thcentury | కడెం తీరంలో పురాతన ఆలయం గుర్తింపు
9thcentury | 9వ శతాబ్దానికి చెందిన చారిత్రక ఆనవాళ్లు
రాష్ట్రకూటులు – చాళుక్యులు – కాకతీయుల శైలిలో శిల్పాలు
శిథిలావస్థలో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గ్రామస్థుల విజ్ఞప్తి
9thcentury | కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని గంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దేవునిగూడెం గ్రామ శివారులో కడెం నది తీరాన 9వ శతాబ్దానికి చెందిన ఒక పురాతన ఆలయాన్ని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపే రాజ్‌కుమార్ గుర్తించారు. కడెం నది కుడివైపున ఎత్తైన కొండపై ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది.

ఆలయానికి చెందిన రాతి దూలాలు, రాతి స్తంభాలు చెల్లాచెదురుగా పడివుండగా, గర్భగుడి మాత్రం కొంతవరకు పదిలంగా ఉంది. ఆలయ ప్రాంగణంలో అలాగే కొంత దూరంలో బయట ఉన్న విగ్రహాల శైలిని పరిశీలిస్తే ఈ ఆలయం రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలంలో నిర్మాణం పొందినట్లు తెలుస్తోంది. కాకతీయుల అనంతరం కాలంలో కూడా ఈ ఆలయం ప్రాచుర్యం పొందినట్లు చరిత్రకారులు భావిస్తున్నారు.

రాష్ట్రకూటుల శైలికి చెందిన గణపతి విగ్రహం అందంగా శిల్పకళతో చెక్కబడింది. అలాగే చాళుక్యుల శైలికి చెందిన భువనపర శిల్పం, గణపతి విగ్రహం, ఏకదేవత అధిష్టాన పీఠం ఇప్పటికీ చెక్కుచెదరని స్థితిలో ఉన్నాయి. ఆలయం ఎదుట ఈశాన్య దిశలో ఒక శాసన పలక కనిపించినప్పటికీ, దానిపై ఉన్న అక్షరాలు చెరిగిపోవడంతో స్పష్టంగా చదవలేని స్థితిలో ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలోని చెట్టు కింద భగ్నమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం, నందులు, సౌందర్యరాధ విగ్రహాలు కనిపిస్తున్నాయి. ఈ కారణంగా స్థానిక గ్రామ ప్రజలు ఈ ఆలయాన్ని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంగా పిలుస్తున్నారు.

కడెం నది తీరాన్ని దాటి దేవునిగూడెం గ్రామం సమీపానికి చేరుకుంటే, ఎడమవైపున చిన్న పందిరి కింద నాలుగు విగ్రహాలు కనిపిస్తాయి. వీటిలో కాకతీయుల అనంతర కాలానికి చెందిన చతుర్భుజ వినాయకుడు, అదే కాలానికి చెందిన దుర్గాదేవిని పోలిన విగ్రహం, అందమైన శిరోజాల అలంకరణతో ఉన్న చాళుక్యుల శైలికి చెందిన చామరధారి విగ్రహం, నంది ప్రతిమలు దర్శనమిస్తాయి.

ఈ విగ్రహాలు భగ్నమవడంతో వాటిని ఆలయం వెలుపల ఉంచి ఉండవచ్చని తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజీ హరగోపాల్ తెలిపారు. ఈ ఆలయాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే రాష్ట్రకూటులు, చాళుక్యులు, కాకతీయుల కాలానికి చెందిన చరిత్రను భావితరాలకు అందించవచ్చని ఆయన పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, గంగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దేవునిగూడెం గ్రామ సమీపంలో కడెం నది తీరాన ఉన్న ఈ పురాతన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని గంగాపూర్, కొర్ర తండా, రాణిగూడా గ్రామాల సర్పంచులు వెడమ జంగు పటేల్, ఎం. విజయలక్ష్మి దాసు నాయక్, తొడసం సీతారాం, జిపి పాలకవర్గ సభ్యులు మరియు గ్రామ ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.
