5aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

5aprSunday2026 | ఆంధ్రప్రభ ఆదివారం సంచిక

ఈ Sunday Magazine సంచికలోని రచయితలందరికి విజ్ఞప్తి… గతంలో కొందరు ఇందులో పబ్లిష్ అయిన తమ రచనలను కాపీ చేసి సోషల్ మీడియాలో పేస్ట్ చేసి వైరల్ చేసుకున్నారు. దయచేసి అలా చెయ్యకండి. కేవలం Sunday Magazine లింక్ మాత్రం పోస్ట్ చెయ్యండి. మీ కథ/శీర్షిక ఆంధ్రప్ర‌భ‌ Sunday Magazine పబ్లిష్ అయిందని మెన్షన్ చెయ్యండి. మీ రచన కోసం పత్రికకు వచ్చి మిగతా రచనలు కూడా చదవాలనేది పత్రిక ఉద్దేశం. దయచేసి సహకరించగలరు.. 
– అసోసియేట్ ఎడిటర్, ప్రభన్యూస్.కాం.

5aprSunday2026 |ఈ సంచికలో…

1. నిశ్శబ్ధం…చాలా విలువైంది(ముఖచిత్ర కథనం)

2. కబుర్లు (శీర్షిక)

3. సన్నిహితం(శీర్షిక)

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

5. వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-_-

నిశ్శబ్ధం…చాలా విలువైంది

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్: శబ్ధం… భావవ్యక్తీకరణకు అది ఒక శక్తివంతమైన మార్గం. సమాచార చేరవేతకది ఒక వారధి. మాటలో సంగీతమో, భావమో ఏదైనా కావచ్చు.

సృష్టి ఆరంభంలో పక్షులూ, జంతువుల అరుపులతో మొదలైన శబ్ధం, రానూ రానూ మానవుల ప్రమేయంతో విజృంభించి దిక్కులన్నీ పిక్కటిల్లేలా విస్తరించింది. శబ్ధానికి ఆధునిక సాంకేతికత తోడైంది… ఇంకేముంది? దాని పరిధి మరింత పెరిగింది.

విస్తరించినంతమాత్రాన కథ సుఖాంతమైపోలేదు. వికటించింది. మానవుడు ఏ శబ్ధానికి ఆధునిక హంగులు జతచేస్తూ పోయాడో, అదే శబ్ధాన్ని అరికట్టలేనంతగా పెంచేశాడు. ఎంతగా పెరిగిపోయిందంటే, అది కాస్తా మనిషి మెదడు, చెవుల పైనే దాడి చేసేంతగా.

ఇప్పుడు మానవుడు శబ్ధాన్ని తప్పించుకుని ఎక్కడికీ పోలేడు. కనీసం కంట్రోల్ కూడా చేయలేడు. ఇలాంటి సమయంలోనే… నిశ్శబ్ధం విలువ తెలిసేది… అది కూడా దొరికితేనే!

మంద్రమైన సంగీతం విలువ గుర్తించేది. చిన్నగా గలగలా పారే సెలయేళ్ళ శబ్ధాలు, పక్షుల కిలకిలారావాలు అలా చెవిని తాకాలని కోరుకున్నా, ఈ ఆధునిక ప్రపంచంలో హోరెత్తే శబ్ధాల మధ్య అలాంటి మృదువైన శబ్ధాలు సాధ్యమా?

నిశ్శబ్ధం విలువేంటి? నిశ్శబ్ధం మనిషికి ఎంత అవసరం? మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి అసలు నిశ్శబ్ధం ఎంతవరకు దోహదం చేస్తుంది? ఒకరోజు, ఒకవారం, కనీసం ఒక నెలలో అయినా ఎంతసేపు నిశ్శబ్ధం మనిషికి అవసరం?

ఇవన్నీ ఇప్పుడు ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఎందుకంటే సమాధానం తెలుసుకోవాలంటే ముందుగా నిశ్శబ్ధం అనుభవించాలి. కానీ ఆ అవకాశం మనకు ఎక్కడుంది?

ఇప్పటి పరిస్థితి చూస్తే… నిశ్శబ్ధం అనేది ఒక “లగ్జరీ ఐటమ్” అయిపోయిందేమో అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రకృతిలో సహజంగా లభించిన ఈ నిశ్శబ్ధం, ఇప్పుడు ప్రత్యేకంగా వెతికే వస్తువుగా మారిపోయింది.

ఉదయం లేచిన క్షణం నుంచి రాత్రి పడుకునే వరకు మన చుట్టూ శబ్ధాల పరంపర. అలారం అరుపులు, వాహనాల హోర్నులు, టీవీ గోల, ఫోన్ల నోటిఫికేషన్లు… ఒకటి ఆగకముందే ఇంకొకటి మొదలవుతుంది. నిశ్శబ్ధానికి చోటు ఇవ్వాలన్న ఆలోచనే మనకు మరిచిపోయింది.

ఇదిలా ఉంటే, మనిషి కూడా శబ్ధాన్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. ఫోన్ మోగకపోతే టెన్షన్, మెసేజ్ రాకపోతే అసహనం, నోటిఫికేషన్ లేకపోతే ఏదో కోల్పోయిన భావన. అంటే, శబ్ధం లేకపోతే మనసే అసహనంగా మారే స్థితికి చేరుకున్నాం.

సెటైర్ ఏమిటంటే… శబ్ధం మనల్ని వెంటాడటం కాదు, మనమే శబ్ధాన్ని వెంటాడుతున్నాం.

నిశ్శబ్ధం అంటే చాలామందికి భయం కూడా. ఎందుకంటే నిశ్శబ్ధంలో మన ఆలోచనలు మనతో మాట్లాడతాయి. మన తప్పులు, మన ఆందోళనలు ఒక్కసారిగా బయటపడతాయి. అందుకే చాలా మంది శబ్ధంలోనే దాక్కుంటారు.

కానీ నిపుణులు చెబుతున్నది వేరే. రోజుకు కొద్దిసేపైనా నిశ్శబ్ధంలో గడపడం వల్ల మెదడు విశ్రాంతి పొందుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది.

ప్రకృతిలోని శబ్ధాలు—పక్షుల కిలకిలారావాలు, గాలిలో ఆకుల సలసల, నీటి గలగల—ఇవన్నీ మనసుకు ఓ ఔషధంలా పనిచేస్తాయి. ఇవి మనలోని అలజడిని తగ్గిస్తాయి.

అయితే మన ఆధునిక జీవన శైలిలో ఇవన్నీ దొరకడం కష్టం. నగరాల్లో అయితే ఇది అసాధ్యం అనే స్థాయికి చేరుకుంది.

అందుకే ఇప్పుడు “సైలెన్స్ థెరపీ”, “డిజిటల్ డీటాక్స్”, “మెడిటేషన్ రిట్రీట్స్” వంటి పదాలు ట్రెండ్ అవుతున్నాయి. ఒకప్పుడు ఉచితంగా లభించిన నిశ్శబ్ధాన్ని ఇప్పుడు డబ్బు పెట్టి కొనాల్సిన పరిస్థితి వచ్చింది.

సెటైర్ ఇక్కడే ఉంది…
ఒకప్పుడు ఉచితంగా లభించిన నిశ్శబ్ధం, ఇప్పుడు ప్రీమియం ప్యాకేజీగా మారిపోయింది.

అయితే నిజంగా మనిషికి ఎంత నిశ్శబ్ధం అవసరం?
రోజుకు కనీసం 15–30 నిమిషాలైనా నిశ్శబ్ధంలో గడపడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

కానీ ఈ సూచనలు వింటే చాలామందికి నవ్వొస్తుంది. ఎందుకంటే “సైలెంట్‌గా కూర్చోవడం” కంటే “బిజీగా ఉన్నట్టు కనిపించడం”నే ఇప్పుడు పెద్ద పని అయిపోయింది.

ప్రపంచ సైలెన్స్ దినోత్సవం వచ్చినప్పుడు మాత్రం… ఒక్కరోజు నిశ్శబ్ధం గురించి మాట్లాడుకుంటాం. irony ఏమిటంటే… నిశ్శబ్ధం గురించి కూడా గట్టిగానే మాట్లాడుకుంటాం!

చివరగా ఒక ప్రశ్న…
మనిషి శబ్ధాన్ని కంట్రోల్ చేస్తున్నాడా? లేక శబ్ధమే మనిషిని కంట్రోల్ చేస్తుందా?

జవాబు మీ దగ్గరే ఉంది…
కానీ దాన్ని వినాలంటే… కొంచెం నిశ్శబ్ధంలోకి వెళ్లాల్సిందే.

-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=-=

2 కబుర్లు (శీర్షిక)

DEC 2025

వేగము – విలువలు

ఒక ఊరిలో రాజయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. ఆయన కొడుకు రవి నగరంలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తూ, పండక్కి తండ్రిని చూడటానికి ఊరికి వచ్చాడు.

రవి ఎప్పుడూ తన స్మార్ట్‌ఫోన్‌లో మునిగిపోయి ఉండేవాడు. చుట్టూ ఉన్న మనుషుల కంటే తన ఫోన్ నోటిఫికేషన్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు.

ఒకరోజు సాయంత్రం ఇద్దరూ ఇంటి అరుగు మీద కూర్చుని ఉన్నారు. రాజయ్య చెట్టు మీద కూర్చున్న ఒక పక్షిని చూపిస్తూ, “అది ఏ పక్షిరా?” అని అడిగాడు.

రవి ఫోన్ నుంచి తల పైకెత్తకుండానే, “అది కాకి నాన్నా,” అన్నాడు.

రెండు నిమిషాల తర్వాత రాజయ్య మళ్ళీ అడిగాడు, “అదేం పక్షిరా?”
రవి విసుగ్గా, “చెప్పానుగా నాన్నా, అది కాకి అని!” అన్నాడు.

మరో నిమిషం తర్వాత రాజయ్య మూడవసారి అదే ప్రశ్న అడిగారు. ఈసారి రవికి కోపం నషాలానికి అంటింది. “నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నీకు వినబడదా? లేక మతిమరుపు వచ్చిందా? ఒకటే ప్రశ్న అడుగుతుంటే చిరాకు రాదా?” అని గట్టిగా అరిచాడు.

రాజయ్య నిశ్శబ్దంగా లోపలికి వెళ్లి ఒక పాత డైరీ పట్టుకొచ్చాడు. అందులో ఒక పేజీ తెరిచి రవికి చూపించాడు. అందులో ఇలా రాసి ఉంది:

“ఈరోజు నా కొడుకు రవికి మూడేళ్లు. మేమిద్దరం అరుగు మీద కూర్చున్నప్పుడు ఒక కాకి వచ్చింది. రవి దాన్ని చూపిస్తూ అది ఏంటని ఇరవై సార్లు అడిగాడు. వాడు అడిగిన ప్రతిసారీ నేను నవ్వుతూ, వాడిని ముద్దాడుతూ అది ‘కాకి’ అని సమాధానం చెప్పాను. వాడు మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే నాకు ఎంతో ముచ్చటగా అనిపించింది.”

రవి కళ్లలో నీళ్లు తిరిగాయి. టెక్నాలజీ ప్రపంచంలో తాను ఎంత వేగంగా పరుగెత్తుతున్నాడో, తనను ఈ స్థాయికి చేర్చిన ప్రేమను, ఓర్పును మాత్రం అంతే వేగంగా మర్చిపోతున్నాడని అతనికి అర్థమైంది.

నేటి సమాజంలో మనం సమాచారాన్ని (Information) వేగంగా పొందుతున్నాం కానీ, సంబంధాలలో ఉండవలసిన సహనాన్ని (Patience) కోల్పోతున్నాం. మన తల్లిదండ్రులు మన చిన్నతనంలో చూపించిన ఓర్పును, వారు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మనం తిరిగి చూపించడమే అసలైన మానవత్వం. నేటి యాంత్రిక జీవనంలో మనం కోల్పోతున్న అతిపెద్ద విలువ ‘సహనం’. ఆధునిక సమాజంలో పెరిగిన వేగం, సోషల్ మీడియా ప్రభావం వల్ల మనుషుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. విలువలు తరుగుతున్నాయి. జీవితాన్ని సులభతరం చేసే టెక్నాలజీ మనసులను కఠినం చేయకూడదు.


———————————————————————-


3.సన్నిహితం… శీర్షిక

DEC 2025

మరచిపో..

జీవితంలో మనకు ఎదురైన చేదు అనుభవాలు మనం ఎప్పటికీ మరచిపోలేం కదా.కానీ జీవితం ముందుకు సాగాలి అంటే ఆ చేదు అనుభవాల్ని మరచిపోయి ముందుకు వెళ్ళాలి. లేదంటే అక్కడే ఆగిపోయి జీవితంలో చాలా నష్టపోతాం.
అయితే మన వ్యక్తిగత జీవితంలో జరిగిన పెద్ద నష్టాలను , బాధలను ఎప్పటికీ మరచిపోలేం. ఆ విషయం పక్కన పెడితే డైలీ లైఫ్ లో జరిగే సాధారణ చేదు అనుభవాల్ని మాత్రం తప్పనిసరిగా మరచిపోవాలి. అప్పుడే మనం దేవుడిచ్చిన ఈ విలువైన జీవితాన్ని ఆనందంగా గడపగలుగుతాం.విజయాన్ని అందుకోగలుగుతాము . నేను ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు రాగింగ్ టైములో ఒక సీనియర్ నన్ను బాగా కొట్టాడు. ఎంతో ఏడ్చాను నేను. తర్వాత ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు ఆ సీనియర్ ‘ తమ్ముడూ అప్పుడు నిన్ను బాగా కొట్టాను.. సారీ ‘ అని గుర్తుచేశాడు. ‘ ఏమో అన్నా..నాకు గుర్తు లేదు ‘ అని చెప్పాను.ఆశ్చర్యంగా చూసాడు నన్ను.
ఆఫీసులో నేను జాయిన్ అయిన కొత్తలో మా బాస్ , ఎవడో చెప్పిన మాట విని నన్ను బాగా తిట్టాడు నా తప్పు ఏమీ లేకపోయినా. చాలా బాధ పడ్డాను. కొన్నాళ్ళ తర్వాత నిజం తెలుసుకున్న బాస్ ‘ సారీ..ఆ రోజు నాకు నిజం తెలీదు ‘ అన్నాడు. ‘ ఏమో సార్..ఆ సంఘటన నాకు గుర్తు లేదు ‘ అని చెప్పాను. అదోలా చూసాడు మా బాస్ .
ఇంకా నేను అభిమానించే ఒక రచయిత నా కథ చదివి మొహమాటం లేకుండా చాలా కఠినంగా ‘ నువ్వు రచయితవు కాలేవు ‘ అని విమర్శించారు. చాలా బాధ పడ్డాను. ఆ తర్వాత ఆ విషయం మర్చిపోయాను.కథలు వ్రాయడం కొనసాగించాను.కొన్నాళ్ళ తర్వాత అదే రచయిత నా కథల్ని చదివి మెచ్చుకున్నారు.
ఇలా… నన్ను బాధ పెట్టిన చిన్న చిన్న విషయాలు నేను ఎప్పటికప్పుడు మర్చిపోయాను.అలా బాధ పెట్టిన వాళ్ళతో కూడా బాగానే ఉన్నాను . ఆనందం కలిగించిన విషయాలే గుర్తు పెట్టుకున్నాను. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాను. కొద్దో గొప్పో విజయాన్ని అందుకున్నాను కూడా .అందుకే మీరు కూడా నాలాగే చేదు విషయాల్ని మర్చిపోయి ఆనందంగా ఉండండి ఫ్రెండ్స్ !!!

====================================

4. ఆలోచనా శ్రీనివాసం (శీర్షిక)

మాటలు కన్నా చేతలు పదునైనవి!

చేతలు తర్వాత, ముందు మాటలు చెప్పేద్దాం! రాజకీయ నాయకులు నుంచి రజనీకాంత్ సినిమాకు డైలాగులు రాసేవాళ్ళ వరకు ఇదే పాటిస్తున్నారు!

సినిమాలో అయితే కెమెరా ట్రిక్స్ తో, VFX magics తో హీరో వెయ్యి మందిని ఒక్క చేత్తో కొట్టినట్టు Visual గా చూపిస్తున్నారు! 50 ఏళ్ల క్రితం ఆ ఫైటింగ్స్ సీన్స్ జనం ఎక్కువ మంది నమ్మేవారు!

సినిమా అనే ప్రక్రియ వచ్చిన కొత్తలో, పల్లెటూళ్లలో ఒక టూరింగ్ హాలులో నేల టిక్కెట్టులో కూర్చున్న ఒక పెద్దాయన తెర మీద పులి గాండ్రింపు విని, పులిని చూసి తన చేతిలో కర్ర ఎత్తి తెర మీదకు విసిరాడు అంట. ఇది అప్పట్లో వైరల్ న్యూస్ అయ్యి దేశం మొత్తం తిరిగింది! సోషల్ మీడియా లేని రోజులు అవి!

నేటి రాజకీయం, కేవలం మాటలు చెప్పి, చెప్పి , చెప్పి …కొన్ని Narratives build చేస్తున్నారు! తమ కంపెనీకి (మన దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ కొందరు వ్యక్తుల వ్యక్తిగత కంపెనీలు అని మనకు తెలుసు) అనుకూలంగా కొన్ని వార్తలు ప్రచారంలోకి తెస్తారు! ఎదుటి పార్టీ లోని నాయకుల సొంత జీవితాలు కూడా హీనం చేస్తూ ఎన్నో మాట్లాడతారు! వాళ్ల సోషల్ మీడియా హ్యాండిల్స్ అవి ప్రచారం చేస్తాయి! నెల జీతాలతో వందల మంది పని చేస్తున్నారు! ఇక్కడ ఇండియాలో, అమెరికా, బ్రిటన్, దుబాయ్ …మొదలైనా దేశాల నుంచి పార్టీల సోషల్ మీడియా ఆఫీసులు రన్ అవుతున్నాయి! ఏదన్నా పెద్ద కేసు ఉన్నా వెంటనే అరెస్టు చేయడం కుదరదు!

ఇది నేటి రాజకీయ వాతావరణం, హద్దులు దాటిపోయింది! తిట్టుకుంటూ, అరుచుకుంటూ…, ఎన్నోసార్లు బూతుల బూట్లు మన ఫోన్లలోకి నడుచుకు వస్తున్నాయి! Sensibility, Civic sense …, సున్నితత్వం పోయింది! మొరటు అయ్యి, మన మెదడు మొద్దుబారిపోయేలా చేస్తున్నారు! దృశ్యం, శ్రవణం రెండూ కూడా!

దేనికి ప్రతిస్పందించాలో తెలీడం లేదు!

” కేయూరాణి నభూషయంతి పురుషం….” అని రేడియోలో ఒకప్పుడు శ్రావణానందకరంగా వినేవాళ్ళం! అని పాత తరం చెబుతోంది!

శ్రవణం రైడియో, దృశ్యం టీవీ! సినిమా! దృశ్యం మన కళ్ళ ముందు కనిపించేది! శ్రవణం మనకు వినిపించేది అంతా! కళ్ళు, చెవులు రెండూ లేనివాళ్ళు 80 శాతం లోకాన్ని చూడలేరు!

ఒకప్పుడు పురాణాలు శ్రవణం చేసేవారు! అంటే ఒకరు చదివేవారు, మిగతా వారు వినేవారు! మధ్యలో చిన్న ప్రవచనం! ఇప్పుడు ప్రవచనాలు కూడా వ్యాపారం అయిపోయింది!

లెర్నింగ్ పిరమిడ్ చెబుతుంది, Lecture 5%, Reading 10%, Audio Visual 20% , Demonstration 30%, Discussion Group 50%, Practice By Doing 75%, Teaching others 90%. Source : National Training Laboratories.

ఏదన్నా ఒక విషయం మనం నేర్చుకోవాలి అంటే, ఏ మెథడ్ వల్ల మనుషులకు ఎక్కవ అర్ధం అవుతుంది అంటే…., పై పిరమిడ్ ద్వారా మనకు కొంత అవగాహన కలుగుతుంది. చేతల ద్వారా, ఆచరించడం ద్వారా, ఇంకా దానిని ఇతరులకు బోధించడం ద్వారా మన అవగాహన పెరుగుతుంది!

మాటలు కన్నా, చేతలు పదునైనవి! చేతల్లో చూపితేనే మన నిజాయితీ అసలు రంగు బయట పడుతుంది!

శ్రవణం గొప్పది! కానీ దృశ్యం ఇంకా బలమైనది! చెవులు ద్వారా విన్నది, కళ్ళు చూసి రూడి చేసుకునే దాకా, మనలో అనుమానాలు అలాగే ఉండి పోతాయి!

ఈ ఇంట్రో మొత్తం, నేడు మన జీవితాల్లో భాగం అయిపోయిన సినిమాలు గురించి, టీవీ సీరియల్స్ గురించి, ఓటిటి OTT platforms ద్వారా చూస్తున్న Web series, అక్కడ Available గా ఉన్న అన్ని దేశాల సినిమాలు గురించి!

మనిషికి, ప్రకృతికి మధ్య ఉన్న గొప్ప బంధాన్ని చెప్పిన అవతార్ సినిమా లాంటి గొప్ప కళాఖండాలు ఉన్నాయి! శంకరాభరణం లాంటి గొప్ప సినిమాలు మన తెలుగులో ఉన్నాయి!

కానీ నేడు సినిమాని ఒక జోక్ లా, ఒక కోక్ లా జనం తీసుకుంటున్నారు! పాటలు ఒక్కటే కాదు మొత్తం సినిమా అంతా ఒక కొరియోగ్రఫీ ఫీట్ అయిపోయింది!

పాప్ కార్న్ తిని, కూల్ డ్రింక్ తాగి, ఫ్యామిలీతో ఒక చిన్న ఔటింగ్! ఇప్పుడు టికెట్ రేట్లు పెరిగాయి!

సినిమా టికెట్ రేటు కన్నా, ఇంటర్వెల్ లో ఒక చిన్న కూల్ డ్రింక్ ప్లస్ పాప్ కార్న్ ఆరు వందల ఏభై రూపాయలు! పెద్ద కూల్ డ్రింక్, పాప్ కార్న్ 850 రూపాయిలు! ఒక్కోసారి ఐదు వేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఒక ఫ్యామిలీకి! అందుకే ఎంతో హిట్ అయిన సినిమాకే జనం వెళ్తున్నారు! లేదంటే సినిమా హాలులు ఖాళీ! షోలు రద్దు అవుతున్నాయి! Multiplex లలో ఈ ఇంటర్వెల్ దందా నశించాలి! ప్రభుత్వాలు, సినిమా ప్రేమికులు కలిసి దీనికి పరిష్కారం చెప్పాలి!

ఇంట్లో హోమ్ థియేటర్ ఉన్నవాళ్ళు ఇంట్లో OTT లో సిన్మా వచ్చేవరకు ఎదురు చూస్తున్నారు! Multiplex సినిమల Interval ఖర్చులకు బయపడి! మనతో వచ్చే పిల్లలు Interval లో అక్కడ కనిపించే అన్నీ కొనమని ఏడ్చి, గోల పెట్టి, దొర్లి…, పేరెంట్లను ఏడిపిస్తున్నారు! సిన్మా సరదా కన్నా ఈ బాధ ఎక్కువ అయ్యింది ప్రేక్షకులకు!

సినిమా ద్వారా లోకాన్ని మార్చాలి అనే పెద్ద ఆశలు ఇక గతం! Now it is just a FUN!

కానీ నాటకం అలా కాదు! మంచి నాటకం మిమ్మల్ని వెంటాడుతుంది! మీతో నడుస్తుంది!

ఇప్పుడు దృశ్యం నాటకం! నాటకం ప్రజల జీవితంలో భాగం అయితే… ఎన్నో గొప్ప మార్పులు వస్తాయి!

రియల్టీ షోలు, కొన్ని టీవీ ప్రోగ్రామ్స్ నాటకం టెక్నిక్స్ తో విజయం సాధించాయి!

నాటకం, మరింత పరివ్యాపితం కావాలి! దృశ్యం, శ్రవణం వీటి మీద, అవి ప్రజల జీవితాల్లో, విద్యార్థుల జీవితాల్లో తీసుకు వచ్చే మార్పుల మీద విస్తృత చర్చ జరగాలి! ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల ఇంటర్నెట్ కు కూడా కొన్ని ఇబ్బందులు రావొచ్చు అనే వదంతులు ఉన్నాయి! యుద్ధం ఆగి, లోకం మొత్తం శాంతి వైపు పయనించాలి! ఒక దేశాధినేత ఇంకో దేశాధినేత గురించి హీనంగా మాట్లాడకూడదు!

మంచి దృశ్యం, మంచి శ్రవణం శాంతి వైపు, సకల జనుల సౌభాగ్యం వైపు తీసుకువెళుతుంది! సర్వేజనా సుఖినోభవంతు!

___________________________________________________________

5.వినరో భాగ్యము వైకుంఠ వైభవము(శీర్షిక)

తిరుమలేశుని సన్నిధిలో
రాజ కుటుంబాల విగ్రహాలు


తిరుమలేశుని అర్చించి తరించిన వందల రాజవంశాలున్నా వెళ్లపై లెక్కించగలిగేంత మందికి మాత్రమే స్వామి ఆలయ ప్రాంగణంలో విగ్రహరూపులై నిలిచే అదృష్టం దక్కింది. అలిగి వైకుంఠం వీడిన శ్రీలక్ష్మిని వెదుకుతూ భూలోకం చేరుకున్న శ్రీ మహావిష్ణువు తిరుమల కొండపై స్వయం వ్యక్త మూర్తిగా ఆవిర్భవించిన శ్రీ వెంకటేశ్వర స్వామి ని తొలినుంచి అర్చించి తరించే భాగ్యాన్ని 20 దాకా రాజవంశాలు దక్కించుకున్నట్టు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి. వారిలో తిరుమలేశునిపై అపారమైన భక్తి ప్రపత్తులతో సేవలు, అర్చనలు, సమర్పణలు చేసిన విజయనగర రాజవంశీకులు ఎక్కువగా కనిపిస్తారు. అందుకు తగినట్టుగానే కొందరు విజయనగర రాజులు విగ్రహరూపులై తిరుమలేశుని ఆలయ ప్రాంగణంలో నేటికీ కనువిందు చేస్తున్నారు.
ఆలయ మహాద్వారాన్ని దాటగానే ఎడమ వైపున విజయనగర రాజ్య ప్రతిష్టను ఇనుమడింప చేసిన శ్రీ కృష్ణదేవరాయలు, తన సతీమణులైన తిరుమలదేవి, చిన్నాదేవి ల రాగి విగ్రహాలుగా ముకుళిత హస్తాలతో స్వామి గర్భాలయం వైపు చూస్తూ నిలుచుని కనిపిస్తారు. అదే మహాద్వారానికి కుడివైపున మరో విజయనగర ప్రభువు అచ్యుతరాయలు, ఆయన సతీమణి వరదాజీ అమ్మాజీల ముకుళిత హస్తులైన విగ్రహాలు కనిపిస్తాయి. వారి పక్కనే చంద్రగిరి ని పాలించిన ఇంకో విజయనగర రాజవంశీకుడు వేంకటపతి రాయలు చేతులు జోడించి నిలుచున్నరాతి విగ్రహ రూపంలో కనిపిస్తారు. వీరిలో కృష్ణ దేవరాయలు స్వయంగా 1517 జనవరి 2న తన ఉభయ దేవేరులతో కలిసి ఏర్పాటు చేసుకున్న విగ్రహాలను ఆవిష్కరించుకున్నట్టు శాసనాధారాలు పేర్కొంటున్నాయి. ఇక అచ్యుత రాయలు విగ్రహం 1529 లో, వేంకటపతిరాయలు విగ్రహం 1592 లో ప్రతిష్ఠితమైనట్టు శాసనాలు తెలియచేస్తున్నాయి. వీరిలో కృష్ణదేవరాయలు సవతి తమ్ముడైన అచ్యుత రాయలు స్వామి ఆలయంలోనే తన పట్టాభిషేకం చేయించుకున్నట్టు కూడా శాసనాలు పేర్కొంటున్నాయి. ఈ రాజులందరూ తిరుమలేశుని ఆలయ నిత్యసేవాకైంకర్యాల నిర్వహణకు, స్వర్ణాభరణాలు, ఇనాం భూములు ఇచ్చినట్టు సంబంధిత దాన శాసనాలు పేర్కొంటున్నాయి.
ఇక ధ్వజస్థంభానికి ఎడమ వైపున ఉన్న తిరుమలరాయ మండపం వద్ద ఒక పురుష , రెండు స్త్రీ మూర్తుల విగ్రహాలు కనిపిస్తాయి. ఆర్కాటు నవాబు సాదారుల్లాఖాన్ కొలువులో పని చేసిన రాజా తోడరమల్లు గా పేరొందిన లాలా ఖేమరామ కర్నాట ప్రాంత పరిపాలకుడిగా ఉన్నప్పుడు 17వ శతాబ్దంలో ఇటు ముస్లిముల, అటు ఆంగ్లేయుల దండయాత్రల నుంచి తిరుమల ఆలయాన్ని కాపాడినట్టు చారిత్రక ఆధారాలు తెలియచేస్తున్నాయి. తిరుమలేశునిపై వారికి ఉన్న అపారమైన భక్తి ని నిదర్శనంగా చేతులు జోడించి స్వామిని ప్రార్ధించే భంగిమలో ఉన్న తోడరమల్లు, అతని తల్లి మాతా మోహన బీబీ, అతని భార్య పితా బీబీల విగ్రహరూపాలతో నేటికీ కనిపిస్తున్నారు. ఆ విధంగా శతాబ్దాలపాటు తిరుమలేశుని అర్చించి తరించిన వందలాదిమంది రాజులలో ఈ 9 మంది మాత్రమే నేటికీ స్వామి ఆలయంలో విగ్రహరూపులై ఉండే భాగ్యాన్ని దక్కించుకుని రాజభక్త శిఖామణులయ్యారు

ఓం నమో వేంకటేశాయ

మరిన్ని చక్కటి వ్యాసాలు, సరికొత్త శీర్షికలతో వచ్చేవారం కలుసుకుందాం…
మీ రచనలు, పుస్తక సమీక్షలు పంపవలసిన మా మెయిల్ఐడి. prabhanewscontent@
gmail.com

click here for more

Leave a Reply