రైతుల త్యాగాలకు గౌరవం…

రైతుల త్యాగాలకు గౌరవం…

అమరావతి తీర్మానం చారిత్రాత్మకం
మహిళల ధైర్యానికి గుర్తింపు
ప్రజా ఉద్యమానికి అసెంబ్లీ ముద్ర
మాజీ మంత్రి నెట్టెం రఘురామ్

విజయవాడ, ఆంధ్రప్రభ : అమరావతి రాజధాని కోసం సాగిన ఉద్యమం రైతుల త్యాగం, మహిళల ధైర్యం, ప్రజల ఆత్మగౌరవం కలిసిన మహోన్నత పోరాటమని మాజీ మంత్రి, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘు రామ్ పేర్కొన్నారు. అమరావతి కోసం తమ పుట్టినిల్లు, పంట భూములను త్యాగం చేసిన రైతులు ఎన్నో కష్టాలను భరిస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపారని తెలిపారు. ఎప్పుడూ గడప దాటని మహిళలు కూడా వీధుల్లోకి వచ్చి తమ హక్కుల కోసం ధైర్యంగా నిలబడటం ఈ ఉద్యమానికి ప్రత్యేకతనిచ్చిందన్నారు. వారి ఆవేదనలో నిజం, పోరాటంలో న్యాయం ఉందని వ్యాఖ్యానించారు.


అప్పటి ప్రభుత్వం ప్రజల ఆవేదనను ఎదుర్కొనే ధైర్యం లేక పరదాల వెనుక దాగాల్సి వచ్చిందని విమర్శించారు. మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్య చరిత్రలో మచ్చగా మిగిలిందని, మహిళల గౌరవాన్ని కాపాడాల్సిన ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆమోదం పొందిన తీర్మానం చారిత్రాత్మక ఘట్టమని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయం అమరావతి కోసం పోరాడిన ప్రతి రైతుకు, ప్రతి మహిళకు లభించిన గౌరవమని అభివర్ణించారు.


రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు, ప్రజా ఆశయాలకు అండగా నిలిచిన కొణిదెల పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. వారి నాయకత్వంలో అమరావతి పునర్నిర్మాణానికి కొత్త దిశ లభిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తూ, ఈ తీర్మానం రైతుల త్యాగాలకు న్యాయం, మహిళల గౌరవానికి గుర్తింపు, ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబమని అన్నారు.

Leave a Reply