దేవాదుల పథకం కెనాల్ పనులు వెంటనే పూర్తి చేయాలి

దేవాదుల పథకం కెనాల్ పనులు వెంటనే పూర్తి చేయాలి

రైతుల పంటలు ఎండిపోతున్నాయి నష్టపరిహారం ఇవ్వాలి..
ఆర్డీఓకు తెలంగాణ రైతు కూలీ సంఘం వినతి

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : జె చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకం ప్యాకేజ్–5లో భాగమైన ఎల్ఎంసి డిసి–3 కెనాల్ నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి ఈర్లపైడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం నర్సంపేట ఆర్డీఓకు సంఘం జిల్లా కార్యవర్గం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నల్లబెల్లి మండలం గొల్లపల్లె గ్రామం నుంచి దబ్బరిపేట, మేడపల్లి, రామారావు తండా, నర్సింగాపురం, ఇటుకాలపల్లి, ఆకులతండా, ఎనగల్ తండా, ముత్తోజిపేట, రాజుపేట దామెర చెరువు వరకు సుమారు 11.905 కిలోమీటర్ల పొడవున నిర్మించాల్సిన ఈ కెనాల్ ద్వారా దాదాపు 5 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు ప్రారంభించారని గుర్తుచేశారు. సంబంధిత కాంట్రాక్టర్ ఆరు సంవత్సరాల క్రితమే పనులను మధ్యలోనే నిలిపివేయడంతో కెనాల్ అసంపూర్తిగా మిగిలిపోయిందన్నారు.

దాంతో ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందక ప్రస్తుత సీజన్‌లో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కెనాల్ పరిధిలో భూములు కోల్పోయిన రైతులకు ఇప్పటివరకు సరైన నష్టపరిహారం అందలేదని పేర్కొన్నారు. వెంటనే నష్టపరిహారం చెల్లించడంతో పాటు నిలిచిపోయిన నిర్మాణ పనులను వేగవంతం చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

రాబోయే సాగు సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రస్తుతం పంటలు లేని వేసవి కాలంలోనే పనులను పూర్తి చేసి రైతులకు సమయానికి సాగునీరు అందేలా ప్రభుత్వం, సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే కాంట్రాక్టర్, ఇరిగేషన్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా నాయకులు భూమా అశోక్, ఎలకంటి కుమారస్వామి, సుక్క వీరన్న, నూకలమరి సదానందం, బోనగిరి సారన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply