YCP Office | మాయమాటలతో కాలక్షేపం..

YCP Office | మాయమాటలతో కాలక్షేపం..
- దివ్యాంగులను మోసం చేసిన ప్రభుత్వం
- ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్..
- పార్టీ కార్యాలయంలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
YCP Office | ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తుందని, చివరికి దివ్యాంగుకు కూడా మాయమాటలు చెప్పి పబ్బం గడుపుతోందంటూ వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్(Devineni Avinash) విమర్శించారు. దివ్యాంగుల పెన్షన్ పెంచుతామంటూ హామీ ఇచ్చి అధికారంలోకి రాగానే, వాటిని విస్మరించడం దారుణమన్నారు.
స్వయం శక్తితో అందరూ ఎదుగుతుండడం దివ్యాంగుల ఆత్మస్థైర్యానికి నిదర్శనమన్నారు. విజయవాడలోని గుణదలలో ఉన్న వైసీపీ కార్యాలయం(YCP Office)లో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని ఈ రోజు ఘనంగా నిర్వహించారు.
వైసీపీ రాష్ట్ర దివ్యాంగుల అధ్యక్షుడు పులిపాటి దుర్గారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు.
అవయవ లోపాన్ని మరిచి స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి(Jaganmohan Reddy) పరిపాలనలో దివ్యాంగులకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెన్షన్ పెంచాం అని అబద్ధాలు ఆడుతున్నారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదరన్ సర్టిఫికెట్ పర్సంటేజ్ అని చెప్పి దివ్యాంగులను ఇబ్బంది పెట్టారని, చంద్రబాబు పెన్షన్ తీసేసి వారికి జీవనోపాధి లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర దివ్యాంగుల విభాగం(YCP State Department of Disabled Persons) ఆధ్వర్యంలో కలెక్టర్‌ను కలిసి పెన్షన్లను పునరుద్ధరణ చేయాలని ధర్నా చేసి వినతి పత్రాన్ని అందజేశామని గుర్తు చేశారు.
అయినప్పటికీ ఈ రోజుకి దివ్యాంగుల సోదరులకు న్యాయం జరగలేదని, కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు ఎవరూ సంతోషంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షుడు వెంకటరెడ్డి, కృష్టా జిల్లా శ్యాముల్, ఏలూరు జిల్లా షమిమ్, పశ్చిమ నియోజకవర్గ అధ్యక్షుడు బద్రి, మదన్ జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షుడు శివాజీ, దుర్గా ప్రసాద్, హరీశ్, నాగిరెడ్డి, శ్రీను పాల్గొన్నారు.
