TG | కార్య‌క‌ర్త‌ల బ‌లంతో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారం చేప‌డ‌తాం : కిష‌న్ రెడ్డి

హైద‌రాబాద్ : బీజేపీపై విమర్శలు చేస్తున్న వారికి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. బీజేపీ-బీఆర్ఎస్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ అంటుంటే, కాంగ్రెస్- బీఆర్ఎస్ కుమ్మక్కు అయిందని బీఆర్ఎస్ ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారు. కానీ త‌మ‌కు ఎవరితోనూ కుమ్మక్కు అయ్యే అవసరం లేద‌న్నారు. తాము కుమ్మక్కు అయ్యేది తెలంగాణ ప్రజలతో మాత్రమేనన్నారు.

తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిగా ప్రముఖ న్యాయవాది, ఏబీవీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచందర్ రావు (N. Ramachandra Rao) ఎంపికయ్యారు. బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆయన ఎన్నిక‌ను అధికారికంగా ప్రకటించారు. మన్నెగూడ (Manneguda)లో జరిగిన సభకు భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. వేదిక వద్ద ర్యాలీగా వచ్చిన నూతన అధ్యక్షుడికి ఘన స్వాగతం లభించింది. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రామచందర్ రావుకు శుభాకాంక్షలు తెలుపుతూ, పార్టీ విజయాలను మరింత పటిష్టం చేస్తారన్న ఆశాభావం వ్యక్తమైంది.

ఈ సంద‌ర్భంగా కిష‌న్ రెడ్డి మాట్లాడుతూ… రేవంత్ రెడ్డి (Revanth Reddy), రాహుల్ గాంధీ, కేసీఆర్ ఎవరి దయాదాక్షిణ్యాలతో తాము గెలవలేద‌న్నారు. ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ముందుకు వెళ్తామన్నారు. బీజేపీపై అర్థం పర్థం లేకుండా రన్నింగ్ కామెంట్స్ చేస్తున్న సన్నాసులకు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదని, సమాధానం చెప్పుకునే అవసరం ఎవరికైనా ఉంది అంటే అది నా తెలంగాణ ప్రజలకు మాత్రమేనన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ (BJP) కార్యకర్తలకు అండగా నిలిచి వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 14కోట్ల మంది సభ్యులు కలిగిన బీజేపీ పార్టీలో సభ్యత్వం కలిగి ఉండటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని అన్నారు. ఎవరు అధ్యక్షులుగా ఉన్నా మనమంతా ఐక్యమత్యంతో అంకితభావంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ అధ్యక్షుడు అయినంత మాత్రాన మాకేమి కిరీటాలు రావని బాధ్యతలన్ని అధ్యక్షుడిపైనే వదిలేసేది లేదన్నారు. ఇంత కాలం సమిష్టిగా పని చేశామని ఇకపై కూడా సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ‌లో కాషాయజెండా ఎగుర‌వేస్తాం…
ఈ రాష్ట్రాన్ని గడిచిన పదేళ్లు బీఆర్ఎస్ పరిపాలిస్తే గత 18 నెలలుగా కాంగ్రెస్ (Congress) పరిపాలిస్తోంది. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ కుటుంబం, రాహుల్ గాంధీ (Rahul Gandhi) కుటుంబం, రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని దోచుకున్నవారేనన్నారు. తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. అందుకే తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. తెలంగాణలో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ బూత్ కు వచ్చిన 100 మందిలో 37మంది నరేంద్ర మోడీని, బీజేపీని ఆశీర్వదించారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలు బీజేపీ అభ్యర్థులు విజయఖేతనం ఎగరవేశారన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే బీజేపీలోని మనమంతా ఐక్యమతంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటి వరకు మనమంతా సమిష్టిగా ముందుకు వెళ్లామని ఇకపై రామచందర్ రావు నాయకత్వంలోనూ కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు.

Leave a Reply