పట్టాదారులం.. కౌలుదారులం కాదు…

పట్టాదారులం.. కౌలుదారులం కాదు…

జగిత్యాల, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీకి తాము పట్టాదారులమని, కౌలుదారులం కాదని మాజీ టీ. జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Adluri Laxman Kumar)ని కలిసి బీర్పూర్ మండలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి నూతన కమిటీ నియామకం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి టీ. జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాల కాలం నుండి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాకుండా జగిత్యాల నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) నాయకులకు పదవులు ఇస్తున్నారన్నారు.

ఒక పెంబట్ల దేవాలయం కమిటీ తప్ప అన్ని దేవాలయ కమిటీలు బీఆర్ఎస్ నాయకులకు ఇచ్చారన్నారు. పొలాస పౌలస్తేశ్వర స్వామి(Polasa Paulasteswara Swamy) ఆలయ కమిటీ సభ్యులుగా ఎవరో చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అనుచరుడికి దేవస్థానం చైర్మెన్ పదవి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సహచరులకు కమిటీలో స్థానం కల్పించారన్నారు. పార్టీలో తమ పరిస్థితి ఏంటని మంత్రిని ప్రశ్నించారు.

తాము అంత రాహుల్ గాంధీ అడుగు జాడలలో నడుస్తున్నామని, జై బాపు జై భీమ్ జై సంవిదాన్ అంటూ ముందుకు పోతున్నామన్నారు. వలసదారుల లాగా దోచుకోవడానికి దాచుకునే వారిమి కాదు కాంగ్రెస్ నాయకులమని అన్నారు. ఈ విషయంపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నియామకాల అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Leave a Reply