Nandikotkur | జలాలతోనే రాయలసీమకు సిరి : చంద్రబాబు

కర్నూలు బ్యూరో : జ‌లాల‌తోనే రాయ‌ల‌సీమ‌కు సిరి అని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) అన్నారు. నందికొట్కూరు (Nandikotkur) మండల పరిధిలోని మల్యాల వద్ద గురువారం హంద్రీనీవా (Handri-Neeva) కు నీటి విడుదల అనంతరం అల్లూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ… ఒక్క సారి అధికారమిస్తే.. ఐదేళ్లపాటు రోడ్లన్నీ గుంతలు కొట్టారు. వాళ్లు చేసిన గుంతలను నేటి వరకు పూడ్చి వేశామన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి చేస్తాం.. సంక్షేమం అందిస్తాం.. అని ప్రకటించిన మేరకు మాటను నిలబెట్టుకున్నామన్నారు.

పెన్షన్ పెంచడానికి గత వైసీపీ ప్రభుత్వంకు మనసు రాలేదన్నారు. ఐదేళ్లు సమయం తీసుకున్నారు. పేద కుటుంబాలకు పెద్ద కొడుకుగా ఉంటున్నా.. పెన్షన్లను ఒకేసారి నాలుగు వేల రూపాయలకు పెంచాం. దివ్యాంగులకు ఆరు రెట్ల మేర పెన్షన్ పెంచాం, రూ.33వేల కోట్లకు పైగా పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీనే అన్న విషయం గుర్తు చేశారు. తల్లికి వందనం చెప్పినట్టు అందరికీ ఇస్తున్నాం.. ఇదీ మా విశ్వసనీయత మారుపేరుగా సీఎం పేర్కొన్నారు. పేదలకు తిండి పెట్టడం నేరమా..? గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను మూసేసింది. కానీ కూటమి ప్రభుత్వం రాగానే అన్న క్యాంటీన్లను తెరిపించాం.. పేదవారికి కడుపు నిండా అన్నం పెడుతున్నామన్నారు. పేదలకు సంక్షేమం అందించడాన్ని గొప్పగా భావించడం లేదు.. ఓ బాధ్యతగా తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

శ్రీశైలం మల్లన్న (Srisailam Mallanna) దగ్గర ప్రారంభమయ్యే నీళ్లు.. తిరుమల వెంకన్న వరకు తీసుకెళ్లవచ్చు అన్నారు. దేవుళ్లను కూడా అనుసంధానం చేసి.. జలహారతి ఇద్దాం.. ఈ రకమైన ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్టు చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేసుకోగలిగితే.. రైతుల కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయన్నారు. ఢిల్లీ (Delhi) లో రెండు రాష్ట్రాల మధ్య నీటి సమస్యలపై చర్చ జరిగింది. ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. రాజకీయాలు ఉంటాయి.. కానీ వీటిని అధిగమించి సమస్యను పరిష్కరిస్తామన్నారు. నన్ను తిట్లు తిట్టినా.. శాపనార్దాలు పెట్టినా.. నేను మనస్సుకు తీసుకోను.. వెనకడుగు వేయను. క్లైమోర్ మైన్లే నన్నేమీ చేయలేకపోయాయి.. ఈ విమర్శలు నన్నేం చేయగలవని చంద్రబాబు పేర్కొన్నారు.

పరిశ్రమను స్థాపించాలంటే నీటి సౌకర్యం కావాలని కియా వాళ్లు అడిగారు. పెనుగొండ సమీపంలో గొల్లపల్లి రిజర్వాయర్ (Gollapalli Reservoir) ను 8 నెలల్లో పూర్తి చేసి.. కియా పరిశ్రమ వచ్చేలా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. హంద్రీనీవా ద్వారా 6 లక్షల ఎకరాలకు పైగా సాగునీరు.. 33లక్షల మందికి తాగు నీరు ఇస్తున్నాం. రాయలసీమ ప్రజల చిరకాల కలను నెరవేర్చామన్నారు. 2019లో ఓ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒక్క ఛాన్స్ అన్నారు.. ప్రజలూ ఏమారారు.. చంద్రబాబు బాగానే చేస్తున్నారు.. కానీ ఓసారి ఛాన్స్ ఇచ్చి చూద్దామని అనుకున్నారు. కానీ ఒక్క ఛాన్స్ ఇస్తే.. ఐదేళ్ల పాటు.. బాదుడే బాదుడు.. నరుకుడే నరుకుడే అన్న ధోరణిలో వ్యవహరించారన్నారు.

రాయలసీమ ప్రాజెక్టులకు రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టిన పార్టీ టీడీపీ పార్టీ అన్నారు. వైసీపీ ఐదేళ్లు అధికారంలో ఉండి కనీసం రూ.2 వేల కోట్లు కూడా ఖర్చు పెట్టలేదన్నారు. రాయలసీమ అంటూ సెంటిమెంట్ ను వైసీపీ రెచ్చగొడుతుంది.. కులాల మధ్య చిచ్చు పెడుతుంది. మాటలు చెప్పడం ఈజీ.. కానీ పనిచేయడం చాలా కష్టమన్నారు. హంద్రీ-నీవాపై వైసీపీ ఒక్క రూపాయి అయినా ఖర్చు పెట్టిందా..? అని ప్రశ్నించారు. కుప్పంలో పెద్ద డ్రామా వేశారు. కాల్వల్లో నీళ్లు లేవు.. ట్యాంకర్లతో నీళ్లు తెచ్చారు.. డమ్మి గేట్లు పెట్టి.. నీళ్లిచ్చామన్నారు. అలాంటి డ్రామాలు ప్రజలకు అవసరమా..? అన్ని ప్రాజెక్టులను పూర్తి చేసింది టీడీపీ.. ప్రాజెక్టులను చెడగొట్టింది వైసీపీ అన్నారు.

పిల్లలకు పాఠాలు చెప్పే టీచర్లు లేకుండా పాఠశాలలు నడిపారు. కానీ తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ప్రక్రియ చేపట్టామన్నారు. రాష్ట్రంలో 16వేల మందికి పైగా టీచర్లను రిక్రూట్ చేసుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. కోటి ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మంచిని చెబుతున్నాం.. ఆశీర్వదించమని కోరుతున్నామన్నారు. చిత్తూరులో మామిడి ధరలు పడిపోయాయి.. కిలోకు రూ.4 అందించి ఆ రైతులను ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. పొగాకు ధర పడిపోతే.. ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్నారు. కేంద్రం రైతులకు పీఎం కిసాన్ డబ్బులు వేయగానే.. రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులు వేస్తుందన్నారు.. మూడు విడతల్లో అన్నదాత సుఖీభవ డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. నిరుద్యోగ భృతిని ఇస్తాం.. కుటుంబాలకు భారం కానివ్వమన్నారు. ఉపాధి కల్పిస్తాం.. ఉద్యోగాలు వచ్చేలా బాధ్యత తాము తీసుకుంటామన్నారు.700కు పైగా ప్రభుత్వ సర్వీసులను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

గతంలో తాను మాత్రమే పరుగులు పెట్టేవాడిని.. ఇప్పుడు తనతో పాటు ప్రజా ప్రతినిధులను.. అధికారులను కూడా పరుగులు పెట్టిస్తానన్నారు. ప్రభుత్వం మామిడి రైతులకు అండగా నిలుస్తుంటే.. చిత్తూరు వెళ్లి రోడ్ల మీద మామిడి కాయలు పోసి దుర్మార్గం చేశారు.. కుట్రలు పన్నారు. వివేకా మరణాన్ని గుండెపోటు అన్నారు.. ఆ తర్వాత గొడ్డలి పోటు అని తేలిన విషయాని గుర్తు చేశారు. ఆ హత్య నెపాన్ని నాపైనే నెట్టారు. వాళ్లు చేసిన నేరాన్ని ఓ ముఖ్యమంత్రి పైనే నెట్టగలిగారంటే.. సామాన్యులు ఓ లెక్కా అన్నారు. వివేకా హత్య కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు కర్నూల్లోనే ఉండి గుండెపోటు డ్రామా ఆడారన్నారు.

ఇకపై నన్ను మోసం చేయలేరు.. తోక జాడిస్తే.. కత్తిరిస్తా
రాయలసీమలో ముఠా కక్షలను నేనే తుదముట్టించాను.. సొంత పార్టీ వారినైనా నేను వదిలి పెట్టలేదన్నారు. సీమలో ముఠాలు లేకుంటే.. ఈ ప్రాంతం దేశంలో అద్భుతమైన అభివృద్ధి సాధిస్తుందన్నారు. నక్సలిజం వద్దని చెబితే.. నన్ను అంతమొందించేందుకు క్లైమోర్ మైన్లు పెట్టారు. ఓ పార్టీకి రాయలసీమ అంటే రాజకీయం. నాకు రాయలసీమ అంటే నీళ్లు అభివృద్ధి వంటివి అన్న విషయం ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Leave a Reply