Warangal | పొగమంచులో ప్రయాణాలు ప్రమాదకరం

Warangal | పొగమంచులో ప్రయాణాలు ప్రమాదకరం

  • రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయకండి
  • గమ్యం కంటే ప్రాణాలు ముఖ్యం
  • కోరి ప్రమాదాలు తెచ్చు కోవద్దు
  • సేఫ్టీ,సెక్యూరిటి లేని జర్నీ చేయోద్ధు
  • వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్

Warangal | వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో పొగ మంచు దుప్పటి కప్పేసి, ఎదురుగా వచ్చేవి కనిపించని పరిస్థితులు నెలకొన్న సమయాల్లో ప్రయాణాలు చేయడం ప్రమాదకరమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఎత్తి చూపారు. ముఖ్యంగా పొగమంచు కారణంగా రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలు చేయొద్దని సూచించారు. పనులున్నాయని తొందరపడి గమ్య స్థానాలు చేరుకొనే ప్రయత్నాలు చేయడం వల్ల ప్రాణాలకే పెనుముప్పు ముంచుకొస్తుందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అలర్ట్ చేశారు. ఎంతటి ముఖ్యమైన పనులున్నా.. పొగమంచు కురిసే వేళల్లో ప్రయాణించడమంటే కోరి ప్రమాదాలు తెచ్చుకోవడమేనని పేర్కొన్నారు. ప్రయాణం కంటే మన సేఫ్టీ, సెక్యూరిటి లేని జర్నీలు చేసి లేని రిస్క్ ల్లో పడొద్దని సూచించారు.

  • వాతావరణంలో మార్పు…

వాతావరణంలో ఒక్కసారిగా వచ్చిన మార్పులతో పొగమంచు తీవ్రత పెరిగిందని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. పొగ మంచు దుప్పటిలా కప్పేయడంతో ఎదురుగా వచ్చేవేవి కనిపించని పరిస్థితులు నెలకొన్న కారణంగా వీలైనంత వరకు వాహనదారులు రాత్రి, తెల్లవారు జామున ప్రయాణాలు చేయొద్దని ప్రజలకు సూచించారు. వాతావరణంలో పొగమంచు తీవ్రత పెరగడం కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రకటన విడుదల చేశారు.

ముఖ్యంగా రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కప్పేసి కనుచూపు మేర రహదారులపై ఎదురుగా వచ్చే వాహనాలు, పాదాచారులను గుర్తించడం కష్టసాధ్యంగా మారిందన్నారు. ప్రతి ఒక్కరిలో వీక్షించే సామర్ధ్యం తక్కువుగా వుంటుందని, పొగ మంచు తీవ్రత కారణంగా విజన్ మరింత తగ్గుతోందన్నారు.ఈ సమయంలో చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని ఎత్తి చూపారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప పొగ మంచు కురిసే సమయాల్లో ప్రయాణాలను మానుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అలాగే పొగమంచు ఎక్కువగా ఉండే సమయంలో వాహనాలు నడుపుతున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. వాహనాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వేగంగా నడపొద్దన్నారు. వాహనదారులు శ్రద్ధతో, నిదానంగా ప్రయాణించాలన్నారు. తక్కువ వీక్షించే సామర్ధ్యం కారణంగా ఇతర వాహనాలు, పాదచారులు, మలుపులు, రోడ్డు విభాగాలు సరిగా కనిపించక ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున, హెడ్‌లైట్లను బీమ్‌లో ఉంచి, ఫాగ్ లైట్లను వాడాలని సూచించారు.

అత్యవసర సమయాల్లో ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాల స్థితిని ముందుగానే తనిఖీ చేసుకోవడంతో పాటు ముఖ్యంగా బ్రేకులు, లైట్లు, టైర్లు సరిగా ఉన్నాయో లేదో సరిచూసుకోవాలన్నారు. డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్స్ వినియోగించొద్దన్నారు. ఆకస్మికంగా ఓవర్‌టేక్ చేయడం, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకరమైన చర్యలకు పాల్పడవద్దన్నారు. పోలీసుల సూచనలతో పాటు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ వాహనదారులు వారి గమ్యస్థానాలకు క్షేమంగా చేరుకోవడమే వరంగల్ పోలీసుల ప్రధాన లక్ష్యమని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

Leave a Reply