సోదరభావానికి ప్రతీకగా రంజాన్ పండుగ…

సోదరభావానికి ప్రతీకగా రంజాన్ పండుగ…

నర్సంపేట డివిజన్ గ్రామాల్లో ఐక్యతా సందేశం
ఉపవాస విరమణతో ఆనందోత్సవాలు…
అన్ని వర్గాలు కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని పిలుపు…

నర్సంపేట రూరల్, ఆంధ్రప్రభ : పవిత్రమైన రంజాన్ మాసాన్ని ముగించుకుంటూ ముస్లిం సోదరులు శనివారం రోజు ఉపవాసాన్ని విరమించి ఆనందోత్సాహాల మధ్య రంజాన్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని గ్రామాలలో ఉన్న మసీదులన్నీ భక్తులతో కళకళలాడాయి. ఉదయం ప్రత్యేక నమాజ్‌లు నిర్వహించి, అల్లాహ్ దయతో సమాజానికి శాంతి, సౌభ్రాతృత్వం కలగాలని ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు మాట్లాడుతూ రంజాన్ పండుగ కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా, అన్ని వర్గాల ప్రజలు కలిసి ఆనందంగా జరుపుకోవాల్సిన పండుగగా భావించాలని పేర్కొన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, పరస్పర సహకారం వంటి విలువలు మన జీవితంలో పెంపొందుతాయని వివరించారు.

గ్రామాలలో ముస్లిం కుటుంబాలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ పండుగను వైభవంగా జరుపుకున్నారు. హిందూ సోదరులు కూడా ముస్లిం సోదరులతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని సోదరభావాన్ని చాటుకున్నారు.

పండుగలు అన్నీ ఒక కులానికి లేదా మతానికి మాత్రమే చెందినవి కావని, భారతదేశం వంటి వైవిధ్యభరిత దేశంలో ప్రతి పండుగను అన్ని వర్గాల ప్రజలు కలిసి జరుపుకోవడం ద్వారా ఐక్యత, సమైక్యత మరింత బలపడుతుందని తెలిపారు. ముస్లిం కుటుంబాలు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో, ఆర్థికంగా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధించి సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.

సమాజంలో శాంతి, ఐక్యత, పరస్పర గౌరవం పెంపొందించడంలో ఇలాంటి పండుగలు ముఖ్య పాత్ర పోషిస్తాయని, ప్రజలందరూ ఒకే కుటుంబంలా జీవించాలని పిలుపునిచ్చారు.

Leave a Reply