విశాఖపట్నం – విశాఖ డిప్యూటీ మేయర్ గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు..నిన్న వాయిదా పడిన ఎన్నికను నేడు నిర్వహించారు. ఈ సమావేశానికి 59 మంది సభ్యుల హాజరయ్యారు. వైసిపి కార్పొరేటర్ లు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. ముందుగా డిప్యూటీ మేయర్ గా గోవింద్ పేరును టిడిపి విప్ , ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. జాయింట్ కలెక్టర్ ఈ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. ఈ ఎన్నికకు కూటమి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు హాజరయ్యారు. అయితే జీవీఎంసీ మేయర్ పదవి ఇప్పటికే తెలుగుదేశం చేపట్టింది. దీంతో డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. వైసీపీ డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు ఇటీవల అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక తప్పనిసరిగా మారింది.
విశాఖ నగరాన్ని అభివృద్ధి చేస్తాం: ఎమ్మెల్యే గణబాబు
విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎమ్మెల్యే గణబాబు తెలిపారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిందని అన్నారు. కేవలం కోఆర్డినేషన్ సమస్యలతోనే నిన్న(సోమవారం) ఈ ఎన్నిక వాయిదా పడిందని తెలిపారు. ఈరోజు ఆరంభంలోనే ఆమోదం లభించిందని చెప్పారు. జీవీఎంసీ మేయర్, డిప్యూటీ స్థానాలను కూటమి పార్టీలు దక్కించుకోవడం విశాఖ నగర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే గణబాబు పేర్కొన్నారు.