Vijayawada | దుర్గా ఘాట్ వద్ద పూడికతీత..

Vijayawada | దుర్గా ఘాట్ వద్ద పూడికతీత..
దుర్గా ఘాట్ పరిశుభ్ర పనులు
పూడికతీత, శుభ్రత, భద్రతా కంచెల ఏర్పాటు
Vijayawada | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : విజయవాడ లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చే లక్షలాది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దుర్గా ఘాట్ వద్ద పూడికతీత, శుభ్రత, భద్రతా చర్యలను యుద్ధప్రతిపాదికన చేపట్టరు. దేవస్థానం ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో కృష్ణా నదీ తీరంలోని దుర్గా ఘాట్‌లో విస్తృత స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. కృష్ణమ్మ చెంత పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు సురక్షితంగా, సౌకర్యంగా స్నానాలు చేసుకునేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఘాట్ మెట్లపై పేరుకుపోయిన సిల్ట్ (పూడిక), బురదను పూర్తిగా తొలగించి ఘాట్‌ను శుభ్రంగా మార్చారు. జారుడు ప్రమాదాలు నివారించేందుకు ఉపరితలాన్ని సురక్షితంగా తీర్చిదిద్దారు. నదీ ప్రవాహం అధికంగా ఉండే ప్రాంతాల్లో భక్తుల భద్రత దృష్ట్యా కొత్తగా సేఫ్టీ గ్రిల్స్ (భద్రతా కంచెలు) ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఘాట్ పరిసరాల్లో పారిశుద్ధ్య పనులను నిరంతరం పర్యవేక్షించాలని ఇంజనీరింగ్, శానిటేషన్ సిబ్బందికి ఈవో ఆదేశాలు జారీ చేశారు. భక్తులు క్రమశిక్షణతో స్నానాలు ఆచరించేలా క్యూలైన్లను క్రమబద్ధీకరించి, అవసరమైన చోట సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ని దర్శించుకునే భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఈ పనులను అత్యంత వేగంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించినట్లు ఈవో సీనా నాయక్ తెలిపారు. భవిష్యత్తులో కూడా భక్తుల సౌకర్యార్థం మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన స్పష్టం చేశారు.

