- జిల్లా యువజన అధికారి సుంకర రాము
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా యువజన అధికారి సుంకర రాము అన్నారు. భీమవరంలోని చాంబర్ ఆఫ్ కామర్స్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని, దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రత్యేక ప్రచార కార్యక్రమాల భాగంగా శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భారత చరిత్రలో ఇంతకుముందెన్నడూ లేని విధంగా, సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజైన అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు అతి పెద్ద ప్రచార యాత్రను నిర్వహించడం జరగుతుందన్నారు. యువతలో ఐక్యత, దేశభక్తి భావాన్ని పెంపొందించే లక్ష్యంతో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో ‘Sardar @150 Unity March’ నిర్వహించబడుతుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఈ యాత్ర త్వరలో నిర్వహించనున్నట్లు చెప్పారు.
బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.వినోద్‌కుమార్ వర్మ మాట్లాడుతూ.. భారత వైవిధ్యాన్ని, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా పట్టణాలు, గ్రామాల్లో అక్టోబర్ 31 నుండి నవంబర్ 25 వరకు పాదయాత్రలు నిర్వహించబోతున్నాంమని వివరించారు.
ప్రచార కార్యక్రమాల భాగంగా యోగా శిబిరాలు, ఆరోగ్య శిబిరాలు, అవగాహన కార్యక్రమాలు, మత్తు రహిత భారత ప్రతిజ్ఞలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ప్రచార యాత్రలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రదర్శనలు, స్వచ్ఛత డ్రైవ్స్, మై భారత్ వాలంటీర్లు, ఎన్‌ఎస్‌ఎస్ క్యాడెట్లు, యువకులు చురుకుగా పాల్గొంటారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ కాగిత సురేంద్ర, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పులఖండం కొటేశ్వరరావు, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రవీణ్, పలువురు పీవోలు పాల్గొన్నారు.

