జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే ”

జిల్లా వ్యాప్తంగా “మెగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ డే ”

మాదకద్రవ్యాల ను పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా విస్తృత తనిఖీలు.
సరైన పత్రాలు లేని 52 వాహనాలు స్వాధీనం .
41 లిక్కర్ బాటిళ్ళు సీజ్.

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా రాష్ట్ర డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఈగల్ ఐజి ఆకే రవి కృష్ణ పర్యవేక్షణలో, కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఆధ్యర్యంలో జిల్లాలోని అన్ని పోలీసు సబ్ డివిజన్‌లలో శనివారం మెగా కార్డన్, సెర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించారు. పత్తికొండ సబ్ డివిజన్ – హోళ గుంద పట్టణం, ఎమ్మిగనూరు సబ్ డివిజన్ – మంత్రాలయం పట్టణం, ఆదోని సబ్ డివిజన్ – ఆదోని తాలుకా పియస్ పరిధిలోని చిన్న పెండెకల్ గ్రామం, కర్నూలు సబ్ డివిజన్ – కర్నూలు నాల్గవ పట్టణ పియస్ పరిధిలోని వీకర్ సెక్షన్ కాలనీలలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ లు నిర్వహించారు.

మాదకద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా సంబంధిత నేరాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టారు. డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది మొత్తం 196 మంది పాల్గొన్నారు. విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. 350 మంది వ్యక్తులను తనిఖీలు చేశారు. 50 అనుమానితుల ఇళ్ళను తనిఖీలు చేశారు.77 వాహనాలను తనిఖీలు చేశారు.సరైన పత్రాలు లేని 52 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మంత్రాలయం పియస్ పరిధిలో 41 లిక్కర్ బాటిళ్ళను సీజ్ చేశారు.

మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య, సామాజిక , చట్టపరమైన దుష్పరిణామాల గురించి అవగాహన కల్పించారు. గంజాయి , ఇతర మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని, కుటుంబ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని వివరించారు. ప్రజలు తమ పరిసర ప్రాంతాల్లో గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం ఉంటే వెంటనే ఏపీ ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది, ప్రజలతో కలిసి మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రతిజ్ఞ చేయించారు. సమాజాన్ని డ్రగ్స్ రహితంగా మార్చడంలో ప్రజల సహకారం ఎంతో ముఖ్యమని ఈ సందర్భంగా పోలీసు అధికారులు పేర్కొన్నారు. మాదకద్రవ్యాల ను పూర్తిగా అరికట్టే దిశగా “ఆపరేషన్ వజ్రప్రహార్” లో భాగంగా ఇలాంటి దాడులు నిరంతరం కొనసాగుతాయని పోలీసు అధికారులు తెలిపారు.

ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పత్తికొండ డిఎస్పీ వెంకట్రామయ్య, ఎమ్మిగనూరు డిఎస్పీ భార్గవి, కర్నూలు మహిళా పియస్ డిఎస్పీ ఉపేంద్రబాబు సిఐలు, ఎస్సైలు, ఈగల్ టీం, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply