- భ్రమరాంబిక దేవీ కన్నడిగుల ఆడపడుచు
- చీరెసారెల సమర్పణకు తరలివస్తున్న కన్నడ భక్తులు
- శైవక్షేత్రానికి నడక యాత్ర
(ఆంధ్రప్రభ, నంద్యాల బ్యూరో) : భానుడు భగభగ మండుతున్నాడు. దప్పికతో గొంతు ఎండిపోతోంది. రాత్రి లేదు.. పగలు లేదు. అడవిలో కాలినడకతో అష్టకష్టాలతో పని లేదు. కానీ తమ పుట్టినింటి ఆడబిడ్డను దర్శించుకోవాలి. ఆమె నుదుటిన మిరియాల బొట్టు దిద్దాలి. గాజులు తొడిగి చీరెసారెలు సమర్పించాలి. అప్పుడు కలిగే దివ్యానుభూతి వర్ణనాతీతం. ఇదీ శ్రీశైలంపై వేంచేసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయంలో కన్నడ భక్తుల అనుభూతి. ఉగాది పర్వదినం సందర్భంగా నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానంలో ఈనెల 27నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు శ్రీశైలం దివ్యక్షేత్రానికి తరలి వస్తున్నారు. మరీ ముఖ్యంగా నల్లమల అడవి మార్గంలో కాలినడకన భక్త జనజాతర కనువిందు చేస్తోంది.
ఆడపడుచుకు సారె సమర్పణకు…
అపర శబరిమలైగా పేరొందిన శ్రీశైలం పుణ్యక్షేత్రంలో తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ రోజున .. శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిని ప్రత్యేకంగా దర్శించుకునేందుకు కన్నడ భక్తులు తండోపతండాలుగా తరలిరావటం విశేషం. వీరందరూ కాలినడక మొక్కుతో శ్రీశైలం చేరుతారు. ఇందుకు ఓ ప్రత్యేకత ఉంది. పురాణ శాస్త్రం ప్రకారం, శ్రీ భ్రమరాంబిక దేవీ కన్నడిగుల ఆడపడుచు. తమ ఇంట్లో అఖండ దీపం వెలిగించి.. పిల్లాజెల్లా.. చిన్నా పెద్ద, ఆడమగ ఇలా ఇంటిల్లిపాది నెలరోజుల పాటు కాలినడకన శ్రీశైలం చేరుకుంటారు. అడవి మార్గంలో మల్లన్న, భ్రమరాంబికను తలచుకుంటూ ఆలయానికి చేరుతారు. ఇక్కడ శ్రీ భ్రమరాంబికను దర్శించుకుని.. తొలుత మిరియాల బొట్టు పెడతారు. దీంతో భ్రమరాంబికకు అంటిన మరక పోతుందని కన్నడిగుల నమ్మకం. ఇక గాజులు, చీరె సారెలు సమర్పిస్తారు. ఇలా ఆది దంపతుల దర్శనం అనంతరం తిరిగి తమ ఇళ్లకు చేరుతారు. ఇలా తమ పుట్టినింటి ఆడపడుచుకు చీరెసారెలు సమర్పించటం కన్నడిగుల ఆచారం, సంప్రదాయం. ఈ ప్రత్యేక పూజలే ఆనవాయితీగా భావిస్తారు. ఇక ఇంట్లో అఖండ దీపం వెలుగుతూనే ఉంటే.. తమ కష్టాలు తీరినట్టేనని సంబరం చేసుకొంటారు.

కన్నడిగుల జాతర…
తమ పుట్టింటి ఆడపడుచు శ్రీ భ్రమరాంబిక దేవీకి తమ ఊరి నుంచి పసుపు కుంకుమ, గాజులు, చీరెసారెలు సమర్పించటానికి కన్నడిగులు బయలుదేరారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వీరు కాలినడకన వివిధ ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా కలిసి.. కర్నూలు, నందికొట్కూరు, ఆత్మకూరు పట్టణాల మీదుగా వెంకటాపురం వరకు కాలినడకన చేరారు. మధ్య మధ్యలో వీరికి ఉచితంగా భోజనాలు, దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, తాగునీరు తదితర సదుపాయాలను దాతలు కల్పించారు. మధ్య మధ్యలో వైద్య శిబిరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
వెంకటాపురం నుంచి నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపుగా 45 కిలోమీటర్లు వేసవిని సైతం లెక్కచేయకుండా మండుటెండల్లో పుట్టింటి ఆడపడుచు భ్రమరాంబికా దేవి మల్లికార్జున స్వామి నామస్మరణలతో ముందుకు సాగిపోతున్నారు. నల్లమల్ల అటవీ ప్రాంతంలో రాత్రి పగలు తేడా లేకుండా పాదయాత్ర చేయటం కన్నడ భక్తుల ప్రత్యేకత. కన్నడిగులు భక్తి పారవశ్యంతో ఊత కర్రల సాయంతో పాదయాత్ర చేస్తున్నారు. అలుపు సొలుపు లేకుండా నడవటం తమకు భ్రమరాంబిక ఇచ్చిన వరంగా భావిస్తామని కన్నడికులు పేర్కొనటం విశేషం. ప్రస్తుతం శ్రీశైలం దేవస్థానం కన్నడిగుల తో కళకళలాడుతోంది. ఇక్కడకు చేరిన భక్తులకు దేవస్థానం అధికారులు ప్రత్యే వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారు.
