TTD | తిరుమలపై వైసీపీ కుట్రలు

TTD | తిరుమలపై వైసీపీ కుట్రలు

  • భక్తుల విశ్వాసాలపై దాడి
  • టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్

TTD | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వైసీపీ కావాలనే కుట్రలు చేస్తోందని, జరగని సంఘటనలను జరిగినట్లు చిత్రీకరిస్తూ భక్తుల మనోభావాలను దెబ్బ‌తీస్తోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకిటీల సురేంద్ర కుమార్ ఆరోపించారు. శుక్రవారం చిత్తూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం తిరుమలలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన ఆలయాల్లో అనుకోని రద్దీని సైతం ముందుగానే అంచనా వేసి సమర్థవంతంగా నిర్వహిస్తోందని స్పష్టం చేశారు.

ఈ సక్రమ నిర్వహణను తట్టుకోలేక వైసీపీ, వారి అనుబంధ మీడియా పని కట్టుకుని తిరుమలలో తొక్కిసలాట జరిగిందని, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని విమర్శించారు. స్వయంగా ఎస్పీ తిరుమలలో పర్యటించి ఎలాంటి తొక్కిసలాట జరగలేదని స్పష్టంగా చెప్పినా, నిత్యం ఏదో అపచారం జరిగిపోతున్నట్టు విష ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీయడానికి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు.

వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆలయాలకు రక్షణ కరువైందని, ఆ సమయంలో జరిగిన కుట్రలు, దాష్టికాలు, దోపిడీలు దేశమంతా చూశాయని ఆయన గుర్తు చేశారు. అధికారం కోల్పోయినా ఇప్పటికీ ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని కొత్త కొత్త అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తూ ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. ఇది కేవలం ఆలయాలపై దాడి కాదని, కోట్లాది భక్తుల విశ్వాసాలపై దాడి అని అన్నారు.

తిరుమల గోశాలలో ఆవులు చనిపోతున్నాయంటూ, నిత్యాన్నదానం సరిగా జరగడం లేదంటూ వదంతులు పుట్టించడం, దర్శన కంపార్ట్‌మెంట్‌లో డ్రామా ఆర్టిస్టులతో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వంటి చర్యలు వైసీపీ దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత వేద విద్యార్థులకు నెలకు రూ.3000 భృతి ఇచ్చి వారి అభ్యున్నతికి సహకరిస్తున్నా, దానిపైనా తప్పుడు విమర్శలు చేస్తున్నారని చెప్పారు.

విలేక‌ర్లు సరదాగా మహాద్వారం గేటు వద్ద ఫోటో దిగితే దానిపైనా తప్పుడు అర్థాలు కట్టబెట్టారని, టీటీడీ చైర్మన్ మతంపై అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. తిరుమలలో భక్తులు పరుగులు తీశారని, తొక్కిసలాట జరిగిందంటూ ఫేక్ వీడియోలు ప్రచారం చేసి భయాందోళనలు సృష్టించారని ఆరోపించారు. వైసీపీ హయాంలో ముంతాజ్ హోటల్‌కు అనుమతులు ఇచ్చి, వాటిని రద్దు చేసిన కూటమి ప్రభుత్వంపైనే నిందలు మోపడం దుర్మార్గమని అన్నారు.

వైసీపీ పాలనలో తిరుమల వేదికగా జరిగిన అవినీతి, దోపిడీలను గుర్తు చేస్తూ, కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ చేయడం, పరకామణి దోపిడీ, తలనీలాల అక్రమ రవాణా, పట్టు శాలువాలు సహా వస్త్రాల కొనుగోళ్లలో అక్రమాలు, అనుబంధ ఆలయాల్లో బంగారం మాయం వంటి అనేక ఘటనలు టీటీడీ ప్రతిష్టకు మచ్చ తెచ్చాయని ఆరోపించారు. దర్శనం, వసతి, ప్రసాదాల ధరలు పెంచి సామాన్య భక్తుడికి వెంకన్న దర్శనం అందకుండా చేశారని విమర్శించారు.

టీటీడీ నిధులను దారి మళ్లించడం, వీఐపీ బ్రేక్ దర్శనాలు, సేవా టికెట్లు, ప్రసాదాల్లో బ్లాక్ మార్కెట్ నడిపించడం, శారదా పీఠానికి అక్రమ భూమి కేటాయింపులు, ఫిక్స్‌డ్ డిపాజిట్లను దారి మళ్లించే ప్రయత్నాలు ఇవన్నీ వైసీపీ పాలనలోనే జరిగాయని ఆరోపించారు. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానాలను, ప్రస్తుత చైర్మన్‌ను లక్ష్యంగా చేసుకుని నిత్యం తప్పుడు ప్రచారాలతో భక్తుల మనోభావాలను దెబ్బతీయడానికి వైసీపీ పని కట్టుకుందని అన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసే వారికి ఆ దేవుడే తగిన శిక్ష విధిస్తారని వెంకిటీల సురేంద్ర కుమార్ వ్యాఖ్యానించారు.

Leave a Reply